Thursday, 16 February 2017

జయహో... ఇస్రో!


కటి...
రెండు...
మూడు...
పది...
వంద...
మొత్తం నూటనాలుగు!
- ఇదేదో కార్పొరేట్‌ కాలేజీల ర్యాంకుల ప్రకటన కాదు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నింగికి పంపనున్న ఉపగ్రహాల సంఖ్య. ఒక్క రాకెట్టుతో నూటనాలుగింటిని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో సర్వసిద్ధమైంది. ఇప్పటిదాకా ఆ సంస్థకు... మూకుమ్మడిగా ఇరవై ఉపగ్రహాలను పంపిన అనుభవమే ఉంది. అది కూడా గత ఏడాదే సాధ్యమైంది. అంతర్జాతీయంగా, ఒక్క రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే అంతరిక్ష నౌక ద్వారా గగనానికి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే, 29 ఉపగ్రహాలకే తటపటాయించింది. దిగ్గజాల రికార్డుల్నీ తోసిరాజంటూ... ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి37 ద్వారా మొత్తం నూటనాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపబోతోంది. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి! అందులో నూటొక్క ఉపగ్రహాలు విదేశాలవే. అమెరికా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు మన సాంకేతిక సాయం తీసుకుంటున్నాయి. అపార అనుభవమూ, అత్యంత చవకైన సేవలు... ఇస్రో ప్రత్యేకత. మిగతా మూడూ - కార్టోశాట్‌-2డి, ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి... అచ్చంగా మనవే! కార్టోశాట్‌-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది. దీనిబరువు ఏడువందలా ముప్పై కిలోలు. మిగతారెండూ నేవిగేషన్‌ వ్యవస్థకు సాయపడే నానో - ఉపగ్రహాలు. ఒక్కొక్కటీ, పదిహేను కిలోల బరువు ఉంటాయంతే!
ఒకేసారి బయల్దేరినా... గమ్యం రాగానే చకచకా బస్సు దిగిపోయే ప్రయాణికుల్లా... తమదైన కక్ష్య సమీపించగానే, దేనికదే వేరుపడిపోతుంది. నూటనాలుగో మజిలీని దాటించడంతో... రాకెట్‌ బాధ్యత తీరిపోతుంది. మరుక్షణమే ఉపగ్రహాల పని మొదలవుతుంది.



జనం కోసం...
స్రో సంధించిన వాటిలో, దాదాపు ముప్పై అయిదు ఉపగ్రహాలు అంతరిక్షం నుంచీ మనకు అండదండలు అందిస్తున్నాయి. ప్రతి ఉపగ్రహానికీ ఓ కచ్చితమైన లక్ష్యం ఉంటుంది. నూటపాతిక కోట్ల పైచిలుకు జనాభా కలిగిన దేశంలో, అందులోనూ డెబ్భైశాతం ప్రజలు పల్లెల్లోనే బతుకుతున్న సమాజంలో - ఇబ్బందులకు కొదవేం ఉంటుంది. ఇక పట్టణాల రుగ్మతలు పట్టణాలకున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం... అది ఏ రంగమైనా కావచ్చు. ఇస్రో తనదైన సాంకేతికతతో కచ్చితమైన పరిష్కారాలు చూపుతోంది. ఉపగ్రహ సమాచారంతో... ఎక్కడ ఏ మేరకు జలసిరులు ఉన్నదీ కచ్చితంగా గుర్తిస్తున్నాం. సముద్రంలో ఏమూలన చేపలు విరివిగా దొరుకుతాయన్నదీ మత్స్యకారులకు చేరవేస్తున్నాం. నేల స్వభావాన్నీ తూకమేసినట్టు అంచనా వేస్తున్నాం. ఏ ప్రాంతం ఎలాంటి పంటలకు అనువైందో శాస్త్రీయంగా నిర్ధరించడమూ సాధ్యం అవుతోంది. ఎక్కడ బూడిద తెగులు పంటల్ని బూడిద చేస్తోందో, ఎక్కడ ఆకు తొలిచేపురుగు రైతు కష్టాన్ని పీల్చి పిప్పిచేస్తోందో ఉపగ్రహాలు లెక్కలేసి చెబుతున్నాయి. చాలా సందర్భాల్లో సర్కారీ అంకెలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతన ఉండదు. అడవుల విస్తీర్ణం విషయంలో ఆ తేడా ఇంకా ఎక్కువ. రికార్డుల్లో ‘దట్టమైన అటవీప్రాంతం’ అని రాసున్నచోట ముళ్లకంపలు కూడా కనిపించకపోవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఆ తేడాల్ని సాక్ష్యాలతో అందిస్తాయి. అంతరించిపోతున్న జీవరాశిని గుర్తించి, రక్షించుకోడానికి కూడా ఉపగ్రహ సమాచారమే దిక్కు. కార్టోశాట్‌-2సి లాంటి ఉపగ్రహాలు సరిహద్దుల్లో శత్రువుల కదలికల్ని పసిగట్టి హెచ్చరికలూ చేయగలవు. పురావస్తు తవ్వకాల్లోనూ ఉపగ్రహ టెక్నాలజీ అండగా నిలుస్తోంది. ప్రతిష్ఠాత్మక ‘జాతీయ తాగునీటి పథకం’ పనితీరును కూడా ఉపగ్రహాల సాయంతోనే పర్యవేక్షిస్తోంది కేంద్రం. ఉపాధి హామీ పథకం పేరు చెప్పి... కోట్లకు కోట్లు మింగేసిన ఘనులున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో వేసిన రోడ్లెన్నో, తవ్విన చెరువులెన్నో, నాటిన మొక్కలెన్నో పక్కాగా లెక్కచూడ్డమూ సాధ్యం అవుతోంది. ఎప్పుడో బ్రిటిష్‌కాలం నాటి భూ రికార్డుల్ని కూడా ఉపగ్రహాల ఆసరాతో సర్వసమగ్రం చేస్తున్నారు.
సమాచార విప్లవం!
సెల్‌ఫోన్‌లోనే సకల వ్యవహారాల్నీ చక్కబెడుతున్నామన్నా, లాప్‌టాప్‌తోనే పదిమంది చేయాల్సిన పనిని ఒంటిచేత్తో లాగిస్తున్నామన్నా - ఇదంతా సమాచార విప్లవ ఫలమే. ఈ సౌకర్యమూ సౌలభ్యమూ అప్రయత్నంగా రాలేదు. ఇస్రో నింగికి పంపిన ఉపగ్రహాలతోనే సాకారమైంది. ఎక్కడో న్యాయస్థానంలో కూర్చున్న జడ్జీగారు, మరెక్కడో వూచల వెనకున్న ఖైదీల్ని ‘వర్చువల్‌’గా విచారిస్తున్నారంటే, ఏ విదేశాల్లోనో స్థిరపడిన వైద్యనిపుణుడు తెలుగుగడ్డ మీదున్న ఒకానొక ఆసుపత్రిలో అచేతనంగా పడున్న రోగి ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా బేరీజు వేస్తున్నాడంటే... ఇస్రో శాటిలైట్‌ వ్యవస్థ ద్వారానే ఇదంతా సాధ¿్యం అవుతోంది. ఎడ్యుశాట్‌ ఉపగ్రహం చదువులతల్లి సాంకేతికరూపం. ఇది, విద్యా సంస్థలతో విద్యార్థులను అనుసంధానం చేస్తోంది. తుపానులు, వరదలు, కరవు, భూకంపాలు తదితర విపత్తుల ఉగ్రస్వరూపాన్ని ముందే గుర్తించి హెచ్చరించడంలోనూ ఇస్రో ఉపగ్రహాలు ముందుంటున్నాయి. రెండేళ్లనాటి హుద్‌హుద్‌ తుపాను పెనువిపత్తే. మనకున్న ఉపగ్రహ పరిజ్ఞానంతో ఆ తీవ్రతను ముందుగానే అంచనా వేయగలిగాం కాబట్టే, కష్టాల్నీ నష్టాన్నీ పరిమితం చేయగలిగాం.‘మన’ జీపీఎస్‌!
భారత్‌ నిన్నమొన్నటి వరకూ అమెరికా గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) పైనే పూర్తిగా ఆధారపడేది. ఆ పరాధీనతను అధిగమిస్తూ... ఇస్రో శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి ఏడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. దీంతో మనకంటూ ఓ నేవిగేషన్‌ వ్యవస్థ సాధ్యమైంది. భారతీయ ప్రాంతీయ నేవిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కోసం బెంగళూరు సమీపంలో ప్రత్యేక కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర నేవిగేషన్‌ సేవలను అందిస్తుంది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ ఆధారిత నావిగేషన్‌లో సమయ నిర్ణయం చాలా కీలకమైంది. అన్ని భూకేంద్ర వ్యవస్థలూ, ఉపగ్రహ గడియారాలూ ఒకే వేళను చూపేలా ఇస్రో ఓ వ్యవస్థను రూపొందించింది.
విశ్వసనీయ నేస్తం...
శ్రీహరికోటలోని పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా 38 సార్లు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాం. అందులో ఒక్కటి మాత్రం గురితప్పింది. చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌లతో పాటు అనేక కీలక విజయాలను ఈ వాహకనౌకే అందించింది. ఇంత కచ్చితత్వం ఎక్కడా సాధ్యం కాదు. అందుకే, పీఎస్‌ఎల్‌వీని అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా ఇస్రో భావిస్తుంది. మరో వాహకనౌక, జీఎస్‌ఎల్‌వీ నుంచి పది ప్రయోగాలు జరిగాయి. అందులో ఆరు విజయవంతం అయ్యాయి. ఈసారి కూడా, పీఎస్‌ఎల్‌వీనే రంగంలోకి దించనున్నారు. ఇప్పటి వరకూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మొత్తం యాభై తొమ్మిది ప్రయోగాలు చేపట్టింది. వాటి ద్వారా మన దేశానికి చెందిన ఎనభైనాలుగు ఉపగ్రహాలనూ, డెబ్భైతొమ్మిది విదేశీ ఉపగ్రహాలనూ నింగికి పంపింది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు రూపొందించిన మరో ఎనిమిదింటిని కూడా అంతరిక్షానికి చేరవేసింది.

మరిన్ని ఘనతల వైపు...
భారతీయులంతా మరో శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలి! ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం లేదు మనకు. ఆ లోటూ త్వరలోనే తీరనుంది. మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం. ప్రయోగించే ప్రతి ఉపగ్రహానికీ ఒక వాహక నౌకను తయారు చేసుకోవడం అంటే, వేలకోట్ల రూపాయల వ్యవహారం. అది కూడా ఒక్కసారికే పనికొస్తుంది. అదే నౌకను వెనక్కి రప్పించుకుని, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే - బొక్కసానికి భారం తగ్గుతుంది. అంతరిక్ష ప్రయోగాల వ్యయమూ ఎనభైశాతం మేర పడిపోతుంది. ఆ ఆలోచనతోనే... ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచీ 65 కిలోమీటర్ల ఎత్తు వరకూ పంపి, మళ్లీ వెనక్కి తెప్పించింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి ఇంకో అడుగు ముందుకేయబోతోంది.
జగమంత కుటుంబం...
స్రో పద్దెనిమిదివేల మంది సభ్యులున్న అతిపెద్ద కుటుంబం. అందులో పదిహేను వేలమంది ఇంజినీర్లూ శాస్త్రవేత్తలే. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. మిగతా విభాగాలు దేశమంతా విస్తరించి ఉన్నాయి. శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌), తిరువనంతపురంలో విక్రంసారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ఉన్నాయి. తిరువనంతపురం కేంద్రంగానే ఉపగ్రహ తయారీ కేంద్రం, ఇతర కీలక విభాగాలూ పనిచేస్తున్నాయి. హసన్‌లోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రమూ, లఖ్‌నవూ, మారిషస్‌లలోని భూ కేంద్రాలూ ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహాల కదలికల్ని గమనిస్తూ తగిన సూచనలు పంపుతాయి. హసన్‌, భోపాల్‌లలో రాకెట్లను నియంత్రించే మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రం ఉంది. హైదరాబాద్‌ సమీపంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీకి చెందిన డేటా రిసెప్షన్‌ స్టేషన్‌ అయితే, ఓ ఉపగ్రహ గణాంకనిధి. విక్రమ్‌ సారాభాయ్‌, సతీష్‌ ధావన్‌, యు.ఆర్‌.రావు, కస్తూరిరంగన్‌ తదితర దిగ్గజాల నిర్దేశకత్వంలో ఇస్రో ఇంతింతై... అన్నట్టుగా ఎదిగింది. ప్రస్తుత ఛైర్మన్‌గా ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు.
విజయ పరంపర...
ర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది. 1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగకేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగుపడింది. ముందుగా, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను (ఆర్‌హెచ్‌-75) అంతరిక్షానికి పంపింది. 1975లో రష్యా సాయంతో మన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను చేరవేసింది. అనంతరం 1979లో, శ్రీహరికోట కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగి మీదికి సంధించింది. ప్రయత్నం విఫలమైనా, ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో... 1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ (రోహిణి)ను విజయవంతంగా గగనానికి చేర్చింది. 1979-81 మధ్యలో భాస్కర ప్రయోగం మరో ముందడుగు. సామాన్యులకు శాస్త్ర, సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ చేపట్టింది. 1975-76లో ‘శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌’ ద్వారా... సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా నిరూపించింది. 1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని పంపింది. 1982-90 మధ్యకాలంలో విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1ను నింగికి చేరవేసింది. ఇది ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాలను అనుసంధానం చేసి వినోద, విజ్ఞానాలతోపాటు విద్యావ్యాప్తికి దోహదపడింది. ఆతర్వాత చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టింది. అందులోనూ గత ఏడాది...మొతం తొమ్మిది ప్రయోగాలు చేపట్టింది. అన్నీ విజయవంతం అయ్యాయి. ఒక రాకెట్‌ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం. పీఎస్‌ఎల్‌వీ-సి36 పీఎస్‌4లో (నాల్గో దశలో) రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో ద్రవ ఇంధనం నింపడం, నావిక్‌ వ్యవస్థ ద్వారా రాకెట్‌ పర్యవేక్షణ, ప్రతికూల వాతావరణంలోనూ రాకెట్‌ అనుసంధానం, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహంలోని పెలోడ్స్‌ను మనమే అభివృద్ధి చేసుకోవడం... ఇలా అన్నీ విజయాలే.
రేపటి ఇస్రో...
ర్థిక అజేయశక్తిగా ఎదుగుతున్న భారత్‌ను సాంకేతికంగానూ తిరుగులేని దేశంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజస్కందాల మీద వేసుకుంది ఇస్రో. ఆ ప్రయత్నంలోనే, అంతరిక్ష విజ్ఞానంలో అగ్రదేశాలకు దీటుగా నిలబెట్టే అనేక ప్రయోగాలు చేపట్టింది.
చంద్రయాన్‌-2
చంద్రుడు మనకు అమ్మవైపు చుట్టం. ‘మామా’ అని ప్రేమగా పిలుస్తాం. ఇప్పటికే చంద్రమండలం వైపు అడుగులు పడ్డాయి. ఆ పరిశోధనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లేందుకు... చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చేఏడాది మొదట్లో గానీ చేపట్టే ఆలోచన ఉంది.
ఆదిత్య-1
ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు. సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ఆదిత్య-1 ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకూ నాసా, ఈసాలు మాత్రమే సూర్యుడికి అతి సమీపంలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టాయి.
మంగళయాన్‌-2
అంగారక గ్రహంపై లోతైన అధ్యయనానికి మంగళయాన్‌-2 సిద్ధమైంది. 2020 సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వాతావరణ్‌ -1
పర్యావరణంలో వచ్చే మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, సముద్ర నీటి మట్టాల్లో తేడాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులు... తదితర అంశాల అధ్యయనానికి త్వరలోనే ఓ ఉపగ్రహం బయలుదేరనుంది.
నాసాతో దోస్తానా...
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలసి పనిచేయనుంది ఇస్రో. సంయుక్తంగా రాడార్‌ను అభివృద్ధి చేస్తాయి. భూకంపాలూ, సునామీల వంటి ఉత్పాతాల్నీ ఇది విశ్లేషించనుంది.
స్క్రాంజెట్‌ ఇంజిన్‌
ఇది వాతావరణంలోని ప్రాణవాయువును ఇంధనంగా మార్చుకుంటుంది. దీనివల్ల లిక్విడ్‌ లేదా క్రయోజెనిక్‌ ఇంజిన్‌కంటే తక్కువ వ్యయం అవుతుంది. అంతరిక్ష ప్రయోగాలు మహాచౌకగా మారిపోతాయి.
జీఎస్‌ఎల్‌వి మార్క్‌-॥।
దీని ద్వారా నాలుగు టన్నులూ, అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపవచ్చు. ఇందులో, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను వినియోగించనున్నారు. ఇదే కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, ఖరీదైన వాహకనౌకలను తప్పించే అవకాశం ఉంది.
హైత్రోపుట్‌ ఉపగ్రహం
ఇస్రో కొత్తగా ‘హైత్రోపుట్‌’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఉపగ్రహం బరువు సుమారు పది టన్నులు. దీని ద్వారా సమాచార సాంకేతిక పరిజ్ఞానం మనకు మరింత చేరువ అవుతుంది.
బెంగళూరులోనే ఎందుకంటే...
ప్రముఖ శాస్త్రవేత్త సతీష్‌ధావన్‌ అప్పట్లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి) డైరెక్టరుగా ఉండేవారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించమని కోరారు. దీనికి అంగీకరిస్తూ ఐఐఎస్‌సి డైరెక్టరుగా కొనసాగుతూనే, ఇస్రో ఛైర్మన్‌గా ఉంటానని మెలికపెట్టారు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటేనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఇందిరాగాంధీµ సరేననడంతో .. ఇస్రో కూడా అక్కడే ఏర్పాటైంది. శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నెలకొల్పడం వెనుకా ఓ కారణం ఉంది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గర కావడంతో, గురుత్వాకర్షణశక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల రాకెట్లకు అదనపు వేగం వస్తుంది. చుట్టూ సముద్రమే కాబట్టి, అనుకోని ప్రమాదాలు జరిగినా... ప్రాణనష్టం నామమాత్రంగానే ఉంటుంది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరు తర్వాత, ప్రపంచంలో ఇదే అత్యుత్తమ రాకెట్‌ ప్రయోగ కేంద్రం.
ఆర్థికంగానూ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్ర ప్రయోగాల్లోనే కాదు, ఆర్థిక ఫలితాల్లోనూ ముందుంది. విదేశీ ఉపగ్రహాల్ని నింగికి పంపుతూ, దేశానికి కోట్ల రూపాయల విలువైన మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. ఇస్రో వాణిజ్య వ్యవహారాల సంస్థ ‘యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో ఈ వ్యాపారం నడుస్తోంది. ఇస్రో ఇప్పటి వరకూ డెబ్భై అయిదు విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ట్రాన్స్‌పాండర్స్‌ను టెలికాం సంస్థలు వినియోగించుకోవడం ద్వారానూ రాబడి వస్తోంది. ఉపగ్రహాలే ఆలంబనగా అందుతున్న - టెలివిజన్‌, డీటీహెచ్‌, డీఎస్‌ఎన్‌జీ, వీశాట్‌, టెలీ విద్య, టెలీ వైద్య... తదితర సేవలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనజీవనాన్ని మెరుగుపరిచేవే, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేసేవే.


నాలుగు దశాబ్దాల క్రితం... ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నింగికి చేర్చడానికి ఇస్రో ఎన్ని కష్టాలు పడిందీ! సాంకేతిక సంపన్న దేశాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసిందీ!
కొన్ని వైఫల్యాలు మంచే చేస్తాయి.
గెలిచితీరాలన్న తపనను రగిలిస్తాయి.
అదే జరిగిందిక్కడ. ఒక్కో పరిమితినీ దాటుతూ, ఒక్కో అవరోధాన్నీ అధిగమిస్తూ, ఒక్కో అడుగూ ముందుకేస్తూ, ఒక్కో మైలురాయినీ వెనక్కితోస్తూ, ఒక్కో ప్రయోగాన్నీ పూర్తిచేసుకుంటూ శతాధిక లక్ష్యాలతో దూసుకెళ్తొంది ఇస్రో.
ఒకప్పుడు, ప్రపంచం వైపు మనం చూశాం.
ఇప్పుడు, ప్రపంచమే మనవైపు చూస్తోంది.
నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది...ఉపగ్రహాలే కాదు
- మన ఘనతా, మన సత్తా!
‘ఇస్రో...నీకు నూటనాలుగు వందనాలు!’

నిపుణుల మాట
పగ్రహాలను ఒక్కొక్కటిగా కక్ష్యలో ప్రవేశ పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆ సమయంలో ఒకదాన్ని మరొకటి ఢీకొనకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ఆయా సమయాలూ, కోణాలూ పూర్తి వేరుగా ఉంటాయి కాబట్టి, ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.
- డాక్టర్‌ శివన్‌ఛైర్మన్‌, ఇస్రో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌
పీఎస్‌ఎల్‌వీ-సి37 ప్రయోగం చాలా సంక్లిష్టమైంది. ప్రస్తుతం షార్‌లో వాహన అనుసంధాన కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయి. ఇదో ప్రపంచ రికార్డు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సమష్టి కృషితోనే ఇదంతా సాధ్యం అవుతోంది.
- కున్హికృష్ణన్‌, షార్‌ సంచాలకులు
షార్‌లో అందుబాటులోకి తెచ్చిన మల్టీ ఆబ్జక్ట్‌ ట్రాకింగ్‌ రాడార్‌ (ఎంఓటీఆర్‌) ఉపగ్రహ ప్రయోగాలకు అండగా నిలుస్తోంది. నిర్దేశిత పరిధిలో 10 వేర్వేరు వస్తువుల్ని ఇది ఏకకాలంలో గుర్తించగలదు. అగ్రదేశాలతో పోటీపడుతున్నా, మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్‌ ఎం.వై.ఎస్‌.ప్రసాద్‌ పూర్వపు డైరెక్టరుశ్రీహరికోట రాకెట్‌ ప్రయోగకేంద్రం