Monday, 5 December 2016

ఇటలీ, న్యూజిలాండ్‌ ప్రధానులు రాజీనామా



వెల్లింగ్టన్‌: ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకేరోజు రెండు దేశాధినేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ, ఇటలీ ప్రధాని మాటియో రెంజీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.
న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎనిమిది ఏళ్ల నుంచి కొనసాగుతున్న జాన్‌ కీ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఇప్పుడేం ఆలోచించలేదని.. కుటుంబ కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లింగ్టన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. భవిష్యత్తులో ప్రధాని పదవికి మళ్లీ పోటీ చేయనని చెప్పారు. జాన్‌ కీ డిసెంబర్‌ 12న అధికారికంగా తన పదవికి రాజీనామా చేయనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ డీలర్‌గా పనిచేసేవారు. 2008లో నేషనల్‌ పార్టీ తరఫున పోటీ చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ప్రధాని ఎంపికపై నేషనల్‌ పార్టీ డిసెంబర్‌ 12న సమావేశం నిర్వహించనుంది. జాన్‌ కీ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేంతవరకు డిప్యూటీ ప్రధాని బిల్‌ ఇంగ్లీష్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇటలీ ప్రధాని రాజీనామా 
ఇటలీ ప్రధాని మాటియో రెంజీ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగ సవరణ అంశంపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ఓడిపోయిన కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సవరణ కోసం ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటలీలో రెండో ప్రపంచ యుద్ధానంతరం జరిగిన అతిపెద్ద సంస్కరణ ఇదే.

No comments:

Post a Comment