Wednesday, 7 December 2016

రూ.వందకే వెయ్యి నోటు!


కోల్‌కతా: పాతనోట్లు మార్చుకోవడానికి మరో కొత్త అవకాశమేమోనని కంగారు పడకండి. పెద్ద నోట్ల రద్దుతో పాత రూ.500, 1000 నోట్లు ఇప్పుడెందుకూ పనికి రాకుండా పోయాయి. పాత నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుని రీసైక్లింగ్‌కి ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకొన్నాళ్లయితే ఈ నోట్లు అసలు కన్పించవు. అందుకని కోల్‌కతాకి చెందిన ఓ బేకరీ ఏం చేసిందంటే..
వ్యాపారస్తులు ప్రజల నోళ్లలో నానే ఏ అంశాన్నైనా తమకనువుగా మార్చుకోగలరనడానికి దీన్ని మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కోల్‌కతాలోని క్రేజీ ఫర్‌ చాకొలెట్స్‌ అనే బేకరీ వారు వినూత్నంగా ఆలోచించి ఆ నోట్ల రూపంలో నోరూరించే చాకొలెట్స్‌ తయారుచేస్తున్నారు. డార్క్‌ చాకొలెట్‌ బేస్‌పై షుగర్‌ పెయింట్‌తో నోట్ల లేఅవుట్‌ను ప్రింట్‌ చేసి అచ్చంగా నోట్లలా కన్పించే చాకొలెట్లను తయారుచేస్తోంది. 500, వెయ్యి రూపాయల నోటు రూపంలో వంద రూపాయలకే ఓ చాకొలెట్‌ని అమ్ముతోంది. అచ్చం నోట్ల కట్టలా ఆకర్షణీయంగా కన్పిస్తున్న ఈ కరెన్సీ నోట్‌ చాకొలెట్స్‌ని చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారట.
‘కౌంటర్‌లో ఉన్న వీటిని చూసి కొంతమంది పొరపాటున నోట్ల కట్ట అక్కడ పెట్టామేమోనని మళ్లీ మళ్లీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. అది చాకొలెట్‌ అని చెప్తే నమ్మలేక పరిశీలనగా చూసి కొనుక్కెళుతున్నారు. ఒకసారి కొనుక్కెళ్లిన వారు మళ్లీ మళ్లీ వస్తున్నారు. కొంతమంది కేక్‌లను కూడా ఇలా తయారుచేయమని సూచించారు. ప్రయత్నిస్తామని చెప్పాం. గిరాకీ ఉన్నంతకాలం వీటిని రూపొందిస్తాం.. బిజినెస్‌కి కావలసింది అదే కదా..’ అంటూ నవ్వుతూ చెప్పారు బేకరీ యజమాని వినయ్‌.

No comments:

Post a Comment