Friday, 16 December 2016

గంగ.. నింగి.. నిండా కాలుష్యమే


వేదమంత్రాల ఘోషతో నిండా ఆధ్యాత్మికతను నింపుకొన్న అక్కడి గాలి ఇప్పుడు గరళమైంది.. పావన గంగానదిని ఇప్పటికే మురుగు కూపంగా మార్చిన కాలుష్యం అక్కడి గాలినీ ప్రాణాంతకంగా మార్చేస్తోంది.. పవిత్ర వారణాసి నగర వాతావరణం ఇప్పుడు కలుషిత వాయువులతో మిళితమైంది..ఆధ్యాత్మిక క్షేత్రం విషపు గాలుల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.. దేశంలోనే అత్యంత కాలుష్య నగరమైన దిల్లీని వారణాసి మించిపోయింది..
త ఏడాదిలో 227 రోజులు వారణాసిలో వాయు కాలుష్యాన్ని పరిశీలించగా ఏ ఒక్క రోజు కూడా అక్కడ స్వచ్ఛమైన గాలి జాడ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గాలిలో.. 2.5 మైక్రాన్ల కంటే చిన్న రేణువులు(పీఎం 2.5) ఘనపు మీటరుకు సగటున 25 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. కానీ, వారణాసిలో అది 60 మైక్రోగ్రాములుంది. వారణాసి ఒక్కటే కాదు ఉత్తర భారత దేశంలోని పలు ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యం ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు వెల్లడించాయి. వారణాసిలో కాలుష్య నియంత్రణ మండలికి చెందిన మూడు పరిశీలన కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒక్క చోటా వాయు నాణ్యత సూచిలో స్వచ్ఛత నమోదు కాలేదు. 2015లో వారణాసిలో నమోదైన వాయుకాలుష్యం దేశంలో ఇంకెక్కడా నమోదు కాలేదని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
ఇవీ కారణాలు
*రహదారులపై విపరీతమైన దుమ్ము
*ఇష్యారాజ్యంగా సాగుతున్న భవన నిర్మాణాలు
*వాహనాల నుంచి వెలువడే పొగ
*డీజిల్‌తో నడిచే ఇంజిన్లు, జనరేట్లు పెద్ద సంఖ్యలో వాడుతుండడం.
*పరిశ్రమలు, భారీ సంఖ్యలో ఉన్న ఇటుకబట్టీలు
వాయుకాలుష్యానికి చిరునామా ఉత్తర్‌ ప్రదేశ్‌
వాయు కాలుష్యం పరంగా అత్యంత ప్రమాదకరమైనవిగా 43 ప్రాంతాలను గుర్తిస్తే అందులో 6 ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఘజియాబాద్‌, నోయిడా, కాన్పూర్‌, ఆగ్రా, వారణాసి, సింగ్రౌలిలను వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా 2009లోనే గుర్తించారు. పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, .. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు ఉండడంతో సమస్య తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాయుకాలుష్యం ఉన్న నగరాల జాబితాను ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. అందులో తొలి 20 నగరాల్లో 10 మన దేశానికి చెందినవే. అయితే, తొలి 20 పేర్లలో వారణాసి లేదు. కానీ, కాలుష్య నియంత్రణ మండలి పరిశీలన కేంద్రాల సమాచారం ఆధారంగా తాజాగా ‘పర్యావరణ, ఇంధన అభివృద్ధి కేంద్రం’.. కేర్‌ ఫర్‌ ఎయిర్‌ సంస్థలు జరిపిన అధ్యయనంలో వారణాసి దేశంలోనే అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరంగా గుర్తించారు.

No comments:

Post a Comment