Wednesday, 7 December 2016

భాగ్యనగరంలో నల్లధనం కలకలం


హైదరాబాద్‌: భాగ్యనగరంలో నల్లధనం కలకలం కొనసాగుతోంది. రూ.13 వేల కోట్ల ఆస్తులున్నాయని ఐడీఎస్‌ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఇద్దరు వ్యాపారులు తొలి విడత పన్ను చెల్లించలేదు. ఇద్దరూ పత్తా లేకుండా పోవడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు వారి కోసం వేట ప్రారంభించారు.
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద లెక్కల్లో చూపని పదివేల కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించిన బానాపురం లక్ష్మణరావుపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. రెండ్రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు చెప్పుకుంటున్న లక్ష్మణరావు స్థిరాస్తి వ్యాపారిగా స్థిరపడ్డారు. 2008లో బిఎల్‌ఆర్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ని ప్రారంభించారు. దానితో పాటూ పలు సంస్థలను ఏర్పాటు చేశారు. వాటిల్లో డైరెక్టర్లు ఆయన కుటుంబ సభ్యులే. రంగారెడ్డి జిల్లా హకీంపేట ఎయిర్‌పోర్టుకు సమీపంలోని దేవరంజన్‌ గ్రామానికి చెందిన లక్ష్మణరావు రెండేళ్ల కిందట ఫిల్మ్‌నగర్‌ ప్రాంతంలో రూ.12కోట్లు వెచ్చించి భవంతిని కొనుగోలు చేశారు. స్థిరాస్తి వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌ నగరంలో కూడా పలు చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ ప్రాంతంలో బీఎల్‌ఆర్‌ పేరుతో ఒక వెంచర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. విలువైన కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. రూ.10వేల కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించిన లక్ష్మణరావు.. వాస్తవంగా అంత ఆస్తిపరుడా? కాదా? ..ఒక వేళ వాస్తవమైతే ఎందుకు సకాలంలో మొదటి విడత పన్ను చెల్లించలేదు అనే అంశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈయన ఎవరికైనా బినామీగా ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం వ్యాపారిదీ అదే దారి?
తన వద్ద లెక్కాపత్రం లేని రూ.3వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద ప్రకటించిన భక్షి తరంజిత్‌సింగ్‌ కోసం ఆదాయపన్నుశాఖ అధికారులు గాలిస్తున్నారు. తరంజిత్‌సింగ్‌ తొలివిడత పన్ను చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment