Saturday, 3 December 2016

సగానికి పైగా నలుపే!

జీడీపీలో 60% పైగా నల్లరంగం 
తాజాగా నిపుణుల అంచనా 
అంతు తెలియని నలుపుతో లెక్కలు తారుమారు.. 
వ్యవస్థలు అతలాకుతలం! 




నం ‘భారత ఆర్థిక రంగం’ అంటూ గొప్పగా, ఘనంగా చాటుకుంటున్నదంతా కూడా నాణేనికి ఒక పార్శ్వమే! నిజానికి ఇలా పైకి ఎంత కనబడుతోందో.. దీని వెనకాల చీకటి తెరల మాటున కూడా అంత జరుగుతోందని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు! ఇంకా చెప్పాలంటే మనం పక్కాగా లెక్కాజమలు చూసుకొంటూ మురుసుకుంటున్న దానికంటే కూడా చీకటి ఆర్థిక రంగమే పెద్దగా ఉంటోందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం 2012 నాటికే మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో ఈ చీకటి ఆర్థిక రంగం 60% దాటిపోయిందని ప్రొఫెసర్‌ అరుణ్‌కుమార్‌ వంటి ఆర్థిక రంగ నిపుణులు నిగ్గు తేలుస్తుండటం ఆందోళనకర వాస్తవం!
నల్లధనం అంటే మనందరం.. అదేదో మనకు సంబంధించిన వ్యవహారమే కానట్లు మాట్లాడుతుంటాం. కానీ ఇల్లు కొనటానికి వెళ్లగానే.. అప్రయత్నంగానే ‘చెక్కు ఎంత? నగదు ఎంత?’ అంటాం! నగదుగా ఇచ్చింది నల్లధనంగా మారిపోబోతోందని మనకు తెలియక కాదు. దుకాణానికి వెళ్లగానే అదనంగా పన్ను పడుతుందని బిల్లు వద్దంటాం. మనకు తెలుసు, ఆ లావాదేవీ ‘నలుపు’ కాబోతోందని! దేశంలో సామాన్యుల దగ్గరి నుంచీ అంతా నల్లధనాన్ని ఇంత మామూలుగా ఆమోదించే స్థాయి వచ్చేసింది. అక్రమ లావాదేవీలూ, చీకటి వ్యవహారాలూ సర్వసాధారణమైపోయిన ఈ పరిస్థితుల్లో అసలీ నల్లభూతం ఎంతగా విస్తరించింది? దీని విస్తృతి ఎంత? అన్నది తెలియకపోవటం మూలంగా మన ఆర్థిక అంచనాలు, ప్రణాళికలన్నీ కూడా తల్లకిందులైపోతున్నాయి. అధికారికంగా చెప్పుకొనేదొకటి, బయట వాస్తవంగా జరిగేదొకటి! దీనివల్ల మన ఆర్థిక రంగంపై ప్రభుత్వాలకూ, వ్యవస్థలకూ నియంత్రణ లేకుండా పోతోంది. ఒక రకంగా దేశం ఆర్థిక అయోమయంలో పడిపోతోందని చెప్పుకోవచ్చు. అందుకే ప్రముఖ ఆర్థిక వేత్త, దిల్లీలోని జేఎన్‌యూలో అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా సేవలందించిన ప్రొ॥ అరుణ్‌కుమార్‌ వంటివారు అసలీ నల్ల ఆర్థిక రంగం ఎంతగా విస్తరించింది, దీన్ని అంచనా వేసేదెలా? అన్నదానిపై విస్తృతంగా కసరత్తులు చేస్తున్నారు. అందరికీ తెలిసినా, ఎవరూ ఎక్కడా దీని గురించి కాగితం మీద పెట్టరు కాబట్టి దీన్ని అంచనా వేయటం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా తయారైంది.
చీకట్లో లెక్కలు!
నల్లధనం ఉందని తెలుసుగానీ దీనికి సంబంధించిన గణాంకాలు ఎక్కడా ఉండవు కాబట్టి నల్లరంగం గురించే పట్టించుకోకుండా, కేవలం తెల్లధనాన్నే లెక్కలేసి, దాని ఆధారంగానే విశ్లేషణలు, విధానాలూ రూపొందిస్తుండటం వల్ల అవన్నీ తప్పుల తడకలుగా తయారవుతున్నాయి. అంతిమంగా ఆశించిన ఫలితాలూ దక్కటం లేదు. కాబట్టి నల్లధనం ఎంత ఉండొచ్చన్న ఉజ్జాయింపు లెక్కలైనా సిద్ధం చేసుకోవటం దేశ సంక్షేమానికి కచ్చితంగా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోనీ మన దగ్గర తెల్ల రంగానికి సంబంధించిన లెక్కలైనా పక్కాగా ఉన్నాయా? అంటే దానికి నల్లరంగమే పెద్ద అవరోధంగా తయారవుతోంది. ఆ రెండూ కలగలిసే నడుస్తున్నాయి. కానీ మనం ఒక దాన్ని చూడనట్టు నటిస్తూ, ఎప్పుడూ తెల్లరంగం గురించే చెప్పుకొంటూ ఉండటం వల్ల మొదటికే నష్టం వస్తోంది. బయటి నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి 2010లో ప్రభుత్వం నల్ల రంగం అంచనా కోసం మూడు అధ్యయనాలను నియోగించింది. కానీ వాటిని ఇంత వరకూ బయటపెట్టలేదు.
రిజర్వు బ్యాంకు నిస్సహాయం!
నల్లధనం విషయంలో రిజర్వు బ్యాంకు పరిస్థితి కూడా నిస్సహాయంగానే తయారైంది. తన నియంత్రణ పరిధికి వెలుపల దేశంలో బోలెడంత ధనం తిరుగాడుతుండటంతో రిజర్వు బ్యాంకు కూడా ద్రవ్యోల్బణం వంటి వాటిని నియంత్రించలేకపోతోంది. ద్రవ్య సరఫరాను కట్టుదిట్టం చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ బయటి నుంచి ధన ప్రవాహం మొదలై, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. స్మగ్లింగ్‌, హవాలా లావాదేవీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఎంతోకొంత స్వతంత్రంగా వ్యవహరించే రిజర్వు బ్యాంకు కూడా ఇప్పటి వరకూ దేశంలో నల్లధనం ఉందన్న వాస్తవాన్ని గుర్తించేందుకే ఇష్టపడటం లేదు.
లెక్క ఎంత కష్టం!
నల్లధనం ఎక్కడా కాగితాల మీద కనబడదు కాబట్టి లెక్క మహా కష్టం. అందుకే తెల్ల రంగంపై పడే నల్లధనం ఆనవాళ్ల ఆధారంగానే దీన్ని అంచనా వేయటం కొంతకాలంగా అనుసరిస్తున్న విధానం. వీటినే ‘ట్రేస్‌ మెథడ్స్‌’ అంటారు. నల్లధనం మూలంగా ఆర్థిక రంగంలో లోపలికీ, బయటకూ ప్రవహించే మొత్తాల మధ్య (ఇన్‌పుట్‌/ఔటపుట్‌) నిష్పత్తి అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి దీని ఆధారంగా లెక్కించటం మరో పద్ధతి. ఇలా రకరకాల పద్ధతుల్లో అంచనా వేసే ప్రయత్నాలు 1970ల నుంచీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రముఖంగా, ఆమోదయోగ్యంగా అందుబాటులోకి వచ్చింది మాత్రం ద్రవ్య విధానం. దీనిలో- వివిధ రంగాల మధ్య, లాభాలకూ వేతనాలకూ మధ్య, అలాగే ఆదాయాల మధ్య ఉండే వ్యత్యాసాలను గుర్తించి, వాటి ఆధారంగా నల్లధనం ఎంత పోగుపడి ఉండొచ్చన్నది లెక్కిస్తారు. అయితే దేశంలో సేవల రంగం విస్తరించటం, విదేశీ వాణిజ్యం పెరిగిపోవటం, రాజకీయ-అధికార-వ్యాపార వర్గాలు కుమ్మక్కవటం వంటివన్నీ కూడా నల్ల రంగం విస్తరించటానికి దోహదం చేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దేశంలో నల్ల రంగం విస్తృతి తెలియాలంటే- సేవల రంగం ఎంతగా విస్తరించింది? జీడీపీలో ప్రైవేటు రంగం వాటా ఎంత? విదేశీ వాణిజ్యంలో జరుగుతున్న అవకతవకలు ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ చూడక తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భిన్నకోణాల నుంచి అంచనా వేసినప్పుడు దేశంలో నల్లధనం 2012 నాటికే జీడీపీలో 62.02 శాతానికి చేరిందని అర్థిక వేత్తలు నిర్ధారణకు రావటం విస్మయకర విశేషం!
సరళీకరణతో నల్లరంగానికి రెక్కలు!
1980ల తర్వాత దేశం ఆర్థిక రంగాన్ని సరళీకరించి, దిగుమతులకు తలుపులు బార్లా తెరవటం వల్ల, 1985 తర్వాత సాఫ్ట్‌వేర్‌ రంగానికి గణనీయంగా రాయితీలు ఇవ్వటం వల్ల సేవల రంగం విపరీతంగా విస్తరించింది. సరుకుల కన్నా సేవల విషయంలో ‘ఇన్వాయిస్‌’లను ఎక్కువతక్కువ చేసి చూపటం చాలా తేలిక కాబట్టి నల్లధనం తయారీకి ఇది బాగా దోహదం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండోది- విదేశీ వాణిజ్యం పెరగటం నల్ల ఆదాయాల తయారీకీ, అలాగే నల్లధనాన్ని దేశం మళ్లించటానికి కూడా దోహదం చేస్తోంది. 1991 సరళీకరణల తర్వాత దేశంలో వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం నెలకొంది గానీ.. ఇదే సమయంలో నల్లధనం తయారీ, దాన్ని తరలించటం రెండూ పెరిగిపోయాయి. పన్ను లేకుండా డబ్బు దాచుకునే నల్లధన ‘స్వర్గ ధామాలు’ చాలానే అక్కరకొచ్చాయి. నల్లధనాన్ని ఇక్కడి నుంచి తరలించటం, విదేశీ వాణిజ్య మార్గాల్లో దాన్ని తిరిగి తెల్లధనంలా వెనక్కి తెచ్చుకోవటానికి మార్గాలు తెరుచుకున్నాయి. దేశంలో వాణిజ్యం / జీడీపీ నిష్పత్తి పెరుగుతున్న కొద్దీ జీడీపీలో నల్లధనం వాటా కూడా పెరుగుతూ రావటం గమనార్హం. అలాగే 1991 తర్వాత దేశంలో నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలంతా కుమ్మక్కై ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని, చట్టపరమైన కార్యకలాపాల్లోనే భారీగా వెనకేసుకోవటమన్నది (క్రోనీ క్యాపిటలిజం) బాగా పెరిగింది. దీన్నుంచి పుట్టేదంతా నల్లధనమే కావటంతో ఇదెంతగా విస్తరించిందో అంచనా కూడా కష్టంగా తయారైంది.
సేవల రంగం.. నల్లరంగానికి వూతం!
న దేశంలో ఎంతోమందికి జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా ఉంటుండటం తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశం. కానీ తెల్ల ఆర్థిక రంగంలో ఈ అదనపు ఆదాయం గురించిన అంచనాలు, గణాంకాలేవీ పెద్దగా కనబడవు. కాబట్టి అదనపు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవటం నల్లరంగం అంచనాకు ఒక కీలక మార్గం. రెండోది అదనపు ఆదాయం, దేశంలో సేవల రంగం అన్నవి రెండూ పరస్పరాధారితంగా ఉంటున్నాయి. నల్లధనం ఎక్కువగా సేవల రంగంలోనే తయారవుతోందని కొందరు ఆర్థిక వేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే లెక్కలు తారుమారు చేసే అవకాశం సేవల రంగంలోనే ఎక్కువ. నల్ల ఆదాయాల చెలామణీకి, ఆదాయ వెల్లడి సరిగా లేకపోవటానికి వ్యవసాయ రంగం ఆలవాలమే అయినా- వ్యవసాయ ఉత్పాదనలపై పన్నుల్లేకపోవటం వల్ల ఈ రంగంలో నల్ల ఆదాయాలు తయారవటం తక్కువే. కాబట్టి అంతిమంగా సేవల రంగంలోనే నల్లధనం అధికంగా తయారవుతోందని భావిస్తున్నారు. వీరు తమ సేవల్లో కొద్దిగా లెక్క చూపకుండా పక్కన ఉంచినా కూడా.. చివరికి అదే భారీఎత్తున నల్లధనం తయారీకి దారి తీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment