హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ‘అమరేంద్ర బాహుబలి అను నేను. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా.. ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని, రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ ఆద్యంతం విజువల్ వండర్‌గా నిలిచింది. రెండో భాగంలో ప్రధాన ఆకర్షణ అనుష్క అంద చందాలు. ఇక యుద్ధ సన్నివేశాలైతే మరోస్థాయికి వెళ్లాయనే చెప్పాలి. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్-రానాల మధ్య జరిగే పోరాట విజువల్స్ చూస్తుంటే ఒళ్లు గగురుపొడిచేలా దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దినట్టు కనపడుతోంది.
‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడు పుట్టలేదు మామ’ అంటూ కట్టప్పను ఉద్దేశించి బాహుబలి పలికిన సంభాషణ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. అంత నమ్మకమైన వ్యక్తి బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నతో రెండో భాగంపై మరింత ఉత్కంఠను పెంచేశారు జక్కన్న. తొలి భాగంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని కొంత వరకే రాజమౌళి చూపించారు. రెండో భాగంలో బాహుబలి పరిపాలనలో ఉన్న మిగిలిన రాజ్యంతో పాటు అనుష్క ఉన్న కుంతల రాజ్యాన్ని చూపించారు. ప్రభాస్-రానా తలపడే యుద్ధ సన్నివేశంతో ట్రైలర్‌ను ముగించారు.
No comments:
Post a Comment