Saturday, 3 December 2016

అది పెద్ద చేప

పేర్లు సహా వాస్తవాలన్నీ ఆదాయపన్ను అధికారులకు వెల్లడిస్తా 
కమీషన్‌ కోసమే ఆ తప్పు పని చేశా 
నా కుటుంబ సభ్యులను ఇరికించొద్దు 
మీడియా చెబుతున్న వ్యక్తులు నిర్దోషులు 
అహ్మదాబాద్‌లోని ‘ఈటీవీ’ స్టూడియోకు వచ్చి వెల్లడించిన మహేశ్‌ షా 
ఆయన రాకపై పోలీసులకు సమాచారం అందించిన ఈటీవీ 
నాటకీయ పరిణామాల నడుమ స్టూడియోలోనే షా అరెస్ట్‌..

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం (ఐడీఎస్‌) కింద... లెక్కాపత్రం లేని రూ.13,860 కోట్ల సొమ్మును వెల్లడించి, అదృశ్యమైన గుజరాత్‌ స్థిరాస్తి వ్యాపారి మహేశ్‌ షా అజ్ఞాతం వీడారు! శనివారం అహ్మదాబాద్‌లోని ‘ఈటీవీ’ స్టూడియోకు ఆయన అకస్మాత్తుగా వచ్చారు. తాను ప్రకటించిన నల్లధనానికి సంబంధించి ఈటీవీ అడిగిన ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలన్నీ పేర్లతో సహా ఆదాయపన్ను అధికారుకే వెల్లడిస్తానన్నారు. తాను పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. అయితే, అప్పటికే ఈటీవీ సమాచారంతో స్టూడియోకు చేరుకున్న ఐటీ, పోలీసు అధికారులు... షాను స్టూడియోలోనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఆయన్ను కాసేపు ప్రశ్నించి, ఠాణాకు తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐడీఎస్‌ గడువు చివరి రోజు సెప్టెంబరు 30న మహేశ్‌ షా తన వద్ద లెక్కల్లో చూపని రూ.13,860 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. కానీ, ఈ పథకం నిబంధనల కింద నవంబరు 30లోగా కట్టాల్సిన మొదటి వాయిదా సొమ్ము రూ.1,560 కోట్లను చెల్లించలేదు. ఆయనకు అంతటి ఆర్థిక పరిస్థితి లేదని భావించిన అధికారులు... నవంబరు 28న షా పెట్టుకున్న ఐడీఎస్‌ ఫారం-2ను రద్దు చేశారు. తర్వాత ఆయన కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేపట్టగా, ఆయన కనిపించకుండాపోయారు. దీంతో షా అదృశ్యమయ్యారనీ.. ఆయన వెల్లడించిన నల్లడబ్బు పలువురు బడా రాజకీయవేత్తలు, అధికారులదేనంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఎట్టకేలకు అదృశ్యం వీడి... నల్లడబ్బును ప్రకటించి, కనిపించకుండాపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ... శనివారం అహ్మదాబాద్‌లోని ‘ఈటీవీ’ స్టూడియోకు మహేశ్‌ షా అకస్మాత్తుగా వచ్చారు. ‘‘నేను ప్రకటించిన రూ.13,860 కోట్ల గురించి మాట్లాడ్డానికి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చా. నా కుటుంబ సభ్యులను ఇందులో ఇరికించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డబ్బు కొందరికి సంబంధించిందంటూ కొన్నిపేర్లు పత్రికల్లో వచ్చాయి. అది నిజం కాదు. వారంతా నిర్దోషులు. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు. ఆ డబ్బుకు సంబంధించి చార్టడ్‌ అకౌంటెంట్‌ ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. ఈ నల్లధనం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే వాస్తవాలన్నీ... పేర్లతో సహా ఆదాయపన్ను అధికారులకే చెబుతాను. అప్పుడు నిజాలు బయటపడతాయి. మీడియా నేను పారిపోయినట్లు చెబుతోంది. అది నిజం కాదు. నేను పారిపోలేదు’’ అని ఆయన చెప్పారు. షా ప్రకటించిన డబ్బు ఎవరిదన్నది చెప్పించేందుకు ఈటీవీ ప్రయత్నించగా... ‘‘నేను ఇప్పుడు ఎవరి పేర్లనూ బయటపెట్టను. ఆ రూ.13,860 కోట్లు నావి కావు. కమీషన్‌ కోసం ఆశపడి, ఆ తప్పు పని చేశా. జరిగిన వాస్తవమంతా అధికారులకు వెల్లడిస్తా. ఆ డబ్బు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులది’’ అని ఉద్వేగపూరిత కంఠంతో చెప్పారు.
అప్పటికే స్టూడియోకు చేరుకున్న ఐటీ, పోలీసులు అధికారులు.. షాను అదుపులోకి తీసుకుని, కాసేపు ప్రశ్నించారు. తర్వాత అక్కడి నుంచి బందోబస్తు నడుమ తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. షా చెబుతున్న విషయాలపై విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు. 

No comments:

Post a Comment