Monday, 5 December 2016

పేమెంట్‌ బ్యాంక్‌లోకి పేటీఎం వ్యాలెట్‌!


ముంబయి: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎం తన వ్యాలెట్‌ సర్వీస్‌లను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డివిజన్‌లోకి విలీనం చేయబోతోంది. ఈ మేరకు పేటీఎం మాతృక సంస్థల్లో ఒకటైన వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ పేర్కొంది. బ్యాంకు సేవలు నిర్వహించేందుకు ఇప్పటికే ఆర్‌బీఐ అనుమతి కోరిన సంస్థ వాటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. విలీన ప్రక్రియ పూర్తయితే వన్‌ 97 సంస్థ ఈ-కామర్స్‌ వ్యవహారాలకు మాత్రమే పరిమితమవుతుంది. పేమెంట్స్‌ బ్యాంక్‌ లెసెన్స్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఆర్‌బీఐ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దాని ప్రకారం వ్యాలెట్‌ బిజినెస్‌ను కొత్తగా ప్రారంభించబోయే పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌కు బదిలీ చేయాలి. దీంతో వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ వ్యాలెట్‌ బిజినెస్‌ను బదిలీ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పేటీఎం వినియోగదారులు యథాతథంగా పేటీఎం వ్యాలెట్‌ నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు లిమిటెడ్‌కు బదిలీ అవుతారు. ఇందుకు అభ్యంతరం తెలపని వినియోగదారులందరినీ డిసెంబర్‌ 21, 2016 నాటికి బ్యాంకుకు మారుస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ తమ వ్యాలెట్‌ను మార్చుకోవడం ఇష్టం లేనివారు ఈ మెయిల్‌ లేదా పేటీఎం వెబ్‌సైట్‌ ద్వారా వారి బ్యాంకు అకౌంట్‌ ఇస్తే దానికి వారి నగదును బదిలీ చేస్తామని పేర్కొన్నారు.

No comments:

Post a Comment