Sunday, 25 December 2016

2016... ఆవిష్కరణలు సూపరు!


జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. 2016లో కొత్తగా ప్రాణం పోసుకున్న అలాంటి ఆవిష్కరణలు ప్రజల ఆదరణని సొంతం చేసుకున్నాయి. ఏటా వాటిలో అత్యుత్తమ పరికరాల జాబితాను విడుదల చేసే ‘టైమ్‌’ సంస్థ, ఈసారీ కొత్త జాబితాతో సిద్ధమైపోయింది. 
డిసన్‌ బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిస్తే, మారిస్‌ అనే శాస్త్రవేత్త ఆ ప్రయత్నాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ గాల్లో తేలే బల్బుని తయారు చేశాడు. ఎలాంటి వైర్లూ, ఆధారం లేకుండా ‘ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌’ సిద్ధాంతాల ఆధారంగా తయారు చేసిన ‘లెవిటేటింగ్‌ ఫ్లైట్‌ బల్బ్‌’కు ఈ ఏడాది అత్యుత్తమ ఆవిష్కరణల్లో తొలి స్థానం దక్కింది. పాశ్చాత్య దేశాల్లో ఈ ఏడాది మొదట్లో మార్కెట్లోకి వచ్చిన బల్బుల ధర దాదాపు పాతిక వేల రూపాయలు.
జేబులో పట్టే హెల్మెట్‌:
జెఫ్‌ వూల్ఫ్‌ అనే రేసర్‌ ట్రాక్‌పైన ఓసారి పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్‌ లేకపోయుంటే తల పగిలిపోయి ఉండేదని డాక్టర్లు చెప్పారు. అంత ముఖ్యమైన వస్తువుని మోసుకెళ్లడం కష్టం కనుకే చాలామంది ధరించడానికి ఇష్టపడరని అతడికి అర్థమైంది. దాంతో తేలికపాటి హెల్మెట్‌ కనిపెట్టడమే ధ్యేయంగా పనిచేసిన జెఫ్‌, ఏకంగా మడుచుకొని జేబులో పెట్టుకోవడానికి వీలయ్యేలా ‘మార్ఫర్‌’ అనే కొత్త హెల్మెట్‌ని తయారు చేశాడు. అమెరికా, యూరప్‌లలో నాణ్యతా ప్రమాణాల్ని అందుకొని అక్కడి మార్కెట్లలోకి అడుగుపెట్టింది.
టైల్స్‌లో సౌర శక్తి: 
ఇంటిపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోకపోవడానికి విదేశాల్లో ఎక్కువమంది చెప్పే కారణం, ఇంటి అందం పాడవుతుందనే. దానికి పరిష్కారంగా ‘టెస్లా’ అనే సంస్థ చూడ్డానికి అందంగా ఉంటూనే, సౌర శక్తిని సేకరించి విద్యుత్‌గా మార్చే టైల్స్‌ను తయారు చేసింది. వీటి రాకతో ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్‌ వినియోగం పెరుగుతుందన్నది సంస్థ మాట.
స్మార్ట్‌ బూట్లు:
బూట్లు వేసుకునే అలవాటున్న వాళ్లకీ, ముఖ్యంగా క్రీడాకారులకీ, వికలాంగులకీ రోజుకి ఎన్నిసార్లు వాటి తాళ్లు వూడిపోతాయో, ప్రతిసారీ కట్టుకోవడం ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో బాగా తెలుసు. నైకీ సంస్థ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తూ, ఒక బటన్‌ నొక్కగానే కాలికి బిగుసుకుపోయి, మళ్లీ బటన్‌ నొక్కగానే వదులుగా మారిపోయే కొత్త రకం బూట్లను తయారు చేసింది.
సోనీ హెడ్‌సెట్‌:
వర్చ్యువల్‌ రియాలిటీ హెడ్‌ సెట్లను ఉపయోగించాలంటే బోలెడు డబ్బులు పెట్టి వాటికి తగ్గ వీడియో గేమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్లే స్టోర్‌లకే అనుసంధానించి వినియోగించేలా కొత్త వీఆర్‌ హెడ్‌సెట్‌ను సోనీ సంస్థ తయారు చేసింది. ఆ దెబ్బతో చాలా దేశాల్లో అంతంతమాత్రంగా ఉన్న వీఆర్‌ హెడ్‌సెట్ల వినియోగం విపరీతంగా పెరిగింది.
తలనొప్పికి ఇన్‌హేలర్‌: 
తలనొప్పీ, నిద్రలేమి లాంటి సమస్యలకు నిత్యం మాత్రల్ని ఆశ్రయించే వాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ వాటి వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ప్రమాదం. దానికి పరిష్కరంగా తలనొప్పీ, ఒళ్లునొప్పులూ, నిద్రలేమి లాంటి వాటికీ తక్షణ ఉపశమనాన్నిచ్చే ‘వేపరైజర్‌ పెన్‌’లను ‘హెచ్‌ఎంబీ’ అనే సంస్థ కనిపెట్టింది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో మాత్రమే అందుబాటులో ఉన్న వీటిని ఇన్‌హేలర్‌లానే ఉపయోగిస్తే ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవని సంస్థ చెబుతోంది.
నిద్రపుచ్చే అలారం:
‘హలో’ అనే గడియారాల తయారీ సంస్థ కనిపెట్టిన ‘హలో సెన్స్‌’ అనే అలారం నిద్రలేపడంతో పాటు హాయిగా నిద్రపుచ్చుతుంది కూడా. మనం నిద్రకు ఉపక్రమించే సమయానికి దాన్ని ఆన్‌ చేస్తే గదిలో వాతావరణాన్ని నియంత్రించడంతో పాటు గదిలో గాలిని శుద్ధి చేసి పరిమళాల్నీ వెదజల్లుతుంది. దానికుండే బల్బు వెలుతుర్నీ క్రమంగా తగ్గిస్తూ గాఢనిద్రలోకి జారుకున్నాక ఆగిపోతుంది. పొద్దున్నే గదిలో కాస్త వేడిని పెంచి, అప్పటికీ లేవకపోతే సంగీతాన్ని వినిపించడం మొదలుపెడుతుంది. నోటి ఆదేశాల ద్వారా పనిచేస్తూ, ఏ రోజు ఎన్నిగంటలు నిద్రపోయామో కూడా ఇది చెప్పేస్తుంది.
‘గుడ్‌ ఇయర్‌’ అనే సంస్థ తయారు చేసిన కారు చక్రాలు 360 డిగ్రీల కోణాల్లో తిరుగుతూ ఇరుకు ప్రదేశాల్లో మలుపు తీసుకోవడానికి పడే ఇబ్బందుల్నీ, పార్కింగ్‌ సమస్యల్నీ దూరం చేస్తున్నాయి. ‘క్విప్‌’ అనే స్మార్ట్‌ టూత్‌ బ్రష్‌ పళ్ల మీద ఉన్న బ్యాక్టీరియా, ఇతర సమస్యల గురించి సమాచారం ఇవ్వడంతో పాటు, టూత్‌బ్రష్‌ని మార్చాల్సిన సమయాన్నీ సూచిస్తుంది. మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా ఏమాత్రం శబ్దం లేకుండా, తక్కువ వ్యవధిలో తలని ఆరబెట్టే హెయిర్‌ డ్రయర్‌ని డైసన్‌ అనే అమెరికన్‌ తయారు చేశాడు. ఈ మూడింటికీ టాప్‌-10 జాబితాలో చివరి మూడు స్థానాలు దక్కాయి. అంతరిక్ష ప్రయోగాల్లోని అద్భుతాలనో, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలనో ప్రస్తావించకుండా సాధారణ వ్యక్తుల రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులకే ‘టైమ్‌’ ఓటేసింది. ఇంతకీ వీటిలో మీకెన్ని నచ్చాయి..!
శుభాకాంక్షలు సరికొత్తగా...
పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ముమ్మాటికీ నిజమే. కాకపోతే ఎప్పుడూ చూసేవే కాబట్టి, ప్రత్యేకంగా మళ్లీ చూసేందుకు ఏమీ ఉండదు. పైగా ఎంత ఖరీదు పెట్టి కొన్నా అవి రెండు మూడు రోజులకే వాడిపోతాయి. ఆ తర్వాత మనం ఏం కానుక ఇచ్చామన్నది తీసుకున్నవారికీ గుర్తుండదు. ఈ కారణంతోనే కొందరు సృజనకారులు టెడ్డీబేర్‌, కుక్కపిల్ల లాంటి కార్టూన్‌, జంతువుల బొమ్మలతో బొకేలను తయారుచెయ్యడం మొదలుపెట్టారు. పువ్వులకు బదులు వేలెడంత సైజున్న రకరకాల సాఫ్ట్‌టాయ్‌ బొమ్మలను గుదిగుచ్చి రూపొందించే ఈ బొకేలు పూల బొకేల్లానే అందంగా ఉండడంతోపాటు, వినూత్నంగానూ ఉంటాయి. వీటిలో పెట్టే బొమ్మలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటికి మెరిసే పూసలూ గాజురాళ్లనూ అంటించి, రంగు రంగుల్లో ప్రకాశవంతంగా ఉండే శాటిన్‌ బట్టలతో అలంకరణ చేస్తారు. వాటిని ఎక్కువ సంఖ్యలో ఒకచోట తీరుగా అమర్చడంతో ఈ బొకేలు చూడగానే కళ్లను కట్టిపడేస్తున్నాయి. ఇక, వీటిలో అచ్చంగా బొమ్మలనే పెట్టి తయారుచేసేవి కొన్నైతే, వాటికి మధ్యలో సహజంగా కనిపించే ప్లాస్టిక్‌ పువ్వులను అమర్చి రూపొందించేవి మరికొన్ని. అప్పటికప్పుడు ఇచ్చేవాటిలో అయితే, సహజమైన పువ్వుల్నే కొన్నిటిని పెట్టివ్వొచ్చు. ఇలా చూడచక్కగా ఉండడమే కాదు, జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్నిరోజులైనా చెక్కుచెదరవు బొమ్మ బొకేలు. కాబట్టి, ఇవి షోకేసుల్లోనూ ఫ్లవర్‌వేజుల స్థానంలోనూ అలంకరణ వస్తువులుగా పెట్టేందుకు కూడా పనికొస్తాయి. అమెజాన్‌, అలీబాబా, షడ్‌మార్ట్‌లాంటి చాలా ఆన్‌లైన్‌ సైట్లతో పాటు, పెద్ద బొకేల దుకాణాల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. కాస్త సృజన ఉంటే సొంతంగా కూడా వీటిని తయారుచేసుకోవచ్చు. సుతిమెత్తగా చూడచక్కగా ఉండే సాఫ్ట్‌టాయ్స్‌ అంటే మామూలుగానే పిల్లలతో పాటు యువతీయువకులక్కూడా ఎంతో మక్కువ. అందుకే, ప్రత్యేక సందర్భాలప్పుడు రంగు రంగుల్లో చిన్నగా ముద్దుగా ఉండే ఈ బొమ్మల బొకేలు వారికి ఇస్తే సంతోషంగానూ సరదాగానే కాదు, వెరైటీగానూ ఉంటుంది. కొత్త ఏడాదిలో కొంగొత్తగా శుభాకాంక్షలు చెబుదామా మరి.

No comments:

Post a Comment