Thursday, 1 December 2016

ముకేశ్‌ ప్రసంగంతో రూ.3వేల కోట్లు ఉఫ్‌!

ముకేశ్‌ ప్రసంగంతో రూ.3వేల కోట్లు ఉఫ్‌!
ముంబయి: జియో ఆఫర్‌ను పొడిగిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చేసిన 25 నిమిషాల ప్రసంగంతో ప్రత్యర్థి టెలికాం కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఈ పతనం మొత్తం విలువ సుమారు రూ.3వేల కోట్లు అని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెలికాం రంగంలో ‘రిలయన్స్‌ జియో’ రాక విప్లవాత్మక మార్పునకు దారి తీసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 30 వరకు ఉచిత వాయిస్‌ కాల్స్‌, డేటా ఆఫర్‌ను ప్రకటించడంతో ఆ నెట్‌వర్క్‌ సిమ్‌ల కోసం జనాలు బారులు తీరారు. తాజాగా ఈ ఆఫర్‌ను ‘హ్యాపీ న్యూ ఇయర్‌’గా నామకరణం చేసి 2017 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గురువారం ఆయన 25 నిమిషాల పాటు ప్రసంగించారు.
‘డిసెంబర్‌ 4 నుంచి జియో కొత్త చందాదారులు ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ ఆఫర్‌తో ఉచిత డేటా, వాయిస్‌కాల్స్‌ను 2017 మార్చి 31 వరకు వినియోగించుకోవచ్చు. పాత చందాదారులకూ ఇది వర్తిస్తుంది’ అని ప్రకటించారు. ముకేశ్‌ అంబానీ ప్రకటన దేశీయ మార్కెట్లో ముఖ్యంగా ప్రత్యర్థి టెలికాం షేర్ల పాలిట శరాఘాతమైంది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఎయిర్‌టెల్‌ షేరు రూ.324 వద్ద ట్రేడ్‌ అవుతుండగా ముకేశ్‌ ప్రసంగం ప్రారంభం కాగా, 2.00గంటల సమయానికి రూ.318కి పడిపోయింది. ఈ మొత్తం మార్కెట్‌ విలువ రూ.2,276 కోట్లు హరించుకుపోయినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.
అంబానీ ప్రకటనతో ఐడియా సెల్యులర్‌ షేర్లు సైతం పతనమయ్యాయి. ప్రసంగానికి ముందు రూ.76.60 వద్ద ట్రేడవుతున్న షేరు 2.30గం.కు రూ.74.20కి పడిపోయింది. దీని మొత్తం మార్కెట్‌ పతనం విలువ రూ.864 కోట్లుగా భావిస్తున్నారు.
రిలయన్స్‌ జియో ప్రారంభించిన మూడు నెలల్లోనే 5కోట్ల చందాదారులు ఏర్పడ్డారు. త్వరలోనే నగదు రహిత లావాదేవీలను సైతం ప్రారంభించనున్నట్లు ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

No comments:

Post a Comment