Sunday, 4 December 2016

నోట్ల రద్దుతో భారత్‌ డిజిటల్‌ పరుగులు

అంచనాకు మించి.. 
నోట్ల రద్దుతో భారత్‌ డిజిటల్‌ పరుగులు 
మారిన పరిస్థితులతో నాలుగేళ్ల అంచనాలు 4 నెలల్లోనే కళ్ల ముందు.. 



వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు పది రెట్లు పెరుగుతాయి..రూ.34 లక్షల కోట్ల మేర చెల్లింపులు నగదు లేకుండానే జరుగుతాయి..స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం వాటా దీనిదే..ఇదంతా నాలుగు నెలల కిందట ప్రఖ్యాత గూగుల్‌, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ సంస్థల అంచనా. కానీ, నాలుగు నెలల్లో అంతా మారిపోయింది.. నవంబరు 8న ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం డిజిటల్‌ చెల్లింపుల రంగానికి మరింత వూపునిచ్చింది. దీంతో నాలుగేళ్లలో వస్తుందనుకున్న మార్పు నాలుగు నెలల్లోనే కళ్లకు కడుతోంది.
న దేశంలో ఇంతకాలం నగదే కీలకమైనప్పటికీ నగరాలు, పట్టణాల్లో కొన్నేళ్లుగా డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతూ వస్తునాయి. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక ఈ మార్పు కనిపిస్తుంది. గ్రామాలకూ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న డిజిటల్‌ చెల్లింపులు.. నోట్ల రద్దు తరువాత తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఇంతవరకు ఆన్‌లైన్‌ షాపింగ్‌, బిల్లుల చెల్లింపు, సినిమా టిక్కెట్లు వంటివాటికే ఈ మార్గం అనుసరించినవారు కూడా ఇప్పుడు నగదు లేకపోవడంతో ప్రతి అవసరానికీ డిజిటల్‌ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు.
ఒక్కసారి అలవాటైతే..
డిజిటల్‌ చెల్లింపులనగానే ఎందుకొచ్చిన గొడవ అని వెనుకాడేవారు కూడా ఒక్కసారి ఈ విధానం అనుసరిస్తే రెండోసారి అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పద్ధతుల్లో ఉన్న సౌలభ్యాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కావాల్సిందంతా అవగాహన.. డబ్బుకు భద్రత.
రెండుమూడేళ్ల కిందట వరకు కూడా చాలామంది రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లలోని కౌంటర్లకు వెళ్లేవారు. సాధారణ టిక్కెట్లయితే సరేసరి.. తత్కాల్‌ టిక్కెట్లు కావాలంటే కౌంటర్‌ తెరవడానికి ఎంతో ముందుగా అర్ధరాత్రి నుంచే అక్కడ పడిగాపులు కాసేవారు. కానీ.. ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్లో సులభంగా టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించడంతో ఎలాంటి ప్రయాస లేకుండా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లు వంటివి అందుబాటులో లేనివారు తమకు సమీపంలోని ఏజెంట్లపై ఆధారపడుతున్నారు. బస్సు టిక్కెట్లకూ ఇంతే. ప్రయివేటు, ఆర్టీసీ టిక్కెట్లు ఆన్‌లైన్లో కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, మొబైల్‌ ఫోన్‌ రీఛార్జిలు వంటివన్నీ యాప్‌ల సహాయంతో పూర్తిచేస్తున్నారు. ఒకసారి ఇలాంటి విధానాల్లో చెల్లించినవారు ఆ తరువాతా అదే కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. ఇంకా ఏమేం చెల్లింపులు ఆన్‌లైన్లో పూర్తిచేయొచ్చో తెలుసుకుంటున్నారు.
అవసరమే ఆ అడ్డుగోడను కూల్చుతోంది..
ఆన్‌లైన్‌ విధానాలను ఒక్కసారి కూడా వినియోగించనివారు మాత్రం ఇంకా తమలోని భయాలను తొలగించుకోలేకపోతున్నారు. భయం, సౌలభ్యం మధ్య ఉన్న ఆ గీత చాలాకాలంగా అలాగే ఉంది. అయితే, నోట్ల రద్దుతో నగదు లభ్యత తగ్గిపోవడం, కొత్త నిబంధనలు రావడంతో అవసరం అనేది ఇప్పుడా గీతను చాలా వేగంగా చెరిపేస్తోంది. ఇది మన దేశాన్ని డిజిటల్‌ చెల్లింపుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది.
బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, గూగుల్‌ అంచనాల ప్రకారం 2020 నాటికి మరో కోటి మంది వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.
చెల్లింపుల విధానం మరింత సులభతరమవుతుంది.
యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) సులభ చెల్లింపుల విధానాన్ని అందరికీ చేరువ చేస్తుంది.
2023 నాటికి దేశంలో 88 శాతం నగదు రహిత వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
ముందుకొస్తున్న వ్యాపారులు
అయితే... దేశంలో నోట్ల రద్దు తరువాత ఈ అంచనాలన్నీ పాతబడిపోయాయి. ఇప్పటికే లక్షలాది మంది తమ వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వైపింగ్‌ యంత్రాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నోట్ల రద్దు నాటికి దేశంలో 15 లక్షల స్వైపింగ్‌ పరికరాలు వినియోగంలో ఉండగా తాజాగా వ్యాపారుల నుంచి బ్యాంకులపై వీటి కోసం ఒత్తిడి పెరుగుతోంది. వచ్చే ఆరు నెలల్లో మరో 10 లక్షల పరికరాలు వినియోగంలోకి వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు తోపుడు బళ్లు వ్యాపారులు కూడా డిజిటల్‌ చెల్లింపులను ఆమోదించేలా మారుతున్నారు. నగదు లభ్యత తగ్గడంతో వ్యాపారం నష్టపోకుండా వెంటనే ఈ విధానంలోకి మళ్లుతున్న సాటి వ్యాపారులు పొందుతున్న ప్రయోజనాలు చూసి మిగతావారూ అదే దారిలో సాగుతున్నారు. అందుకోసం అవగాహన పెంచుకుంటున్నారు. పేటీఎం, మొబిక్విక్‌ వంటి వ్యాలెట్లలో ఖాతాలు తెరిచి ఎంత చిన్నమొత్తమైనా స్వీకరించేలా సన్నద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment