Friday, 16 December 2016

డిజిటల్‌ చెల్లింపుదారులకు కళ్లు చెదిరేలా ప్రభుత్వ నజరానా

          గెల్చుకోండి రూ.కోటి 
          క్రిస్మస్‌ రోజు ప్రారంభం 
అంబేడ్కర్‌ జయంతినాడు మెగా డ్రా 

 దిల్లీ: అదృష్టం మీ తలుపు తట్టొచ్చు. రూ.కోటి మీ సొంతం కావచ్చు. కళ్లు చెదిరే ఈ మొత్తం దక్కాలంటే మాత్రం మీరొక పని చేయాలి. చెల్లింపులను ప్రభుత్వం పేర్కొన్న డిజిటల్‌ పద్ధతుల్లో చేయాలి. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రెండు లక్కీ డ్రా పథకాలను ప్రవేశపెట్టింది. వందరోజుల పాటు కొనసాగే ఈ పథకాల కింద మొత్తం రూ.340 కోట్ల విలువైన నగదు బహుమతులను పంపిణీ చేస్తుంది. క్రిస్మస్‌ రోజైన ఈ నెల 25న ఈ పథకాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి వరకు లక్కీడ్రాలు కొనసాగుతాయి. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌ ఈ పథకాల వివరాలనువెల్లడించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా వీటిని అమలుచేయబోతున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌14 తర్వాత కూడా ఈ పథకాలను కొనసాగించాలా?లేదా?అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
లక్కీ గ్రాహక్‌ యోజన:
ఈ పథకం వినియోగదారులకు ఉద్దేశించింది. వందరోజులపాటు ప్రతి రోజూ 15వేల మంది అదృష్ట వినియోగదారులను డ్రాద్వారా ఎంపిక చేసి ఒక్కోరికి రూ.వెయ్యి బహుమతి ఇస్తారు.
వారానికోసారి 7వేలమందికి డ్రా తీసి రూ.లక్ష, రూ.10వేలు, రూ.5వేలు బహుమతిగా అందిస్తారు.
రూ.50 నుంచి రూ.3వేలలోపు లావాదేవీలు చేసేవారే ఇందుకు అర్హులు.
రూపేకార్డు, యూపీఐ, ఎస్‌ఎస్‌ఎస్‌డీ, ఆధార్‌ ఆధారిత చెల్లింపులు జరిపేవారికి మాత్రమే ఈ ప్రోత్సాహకాలు ఇస్తారు. వీసా, మాస్టర్‌కార్డులు, ప్రైవేటు కంపెనీల ఈ-వ్యాలెట్లు వాడే వారు ఈ పథకాల పరిధిలోకి రారు. అలాగే వ్యక్తులమధ్య జరిగే లావాదేవీలు, ఒక బ్యాంకు ఖాతానుంచి మరోబ్యాంకు ఖాతాకుచేసే ఆన్‌లైన్‌ బదిలీలకూ ఇదివర్తించదు.
డిజి-ధన్‌ వ్యాపారి యోజన 
డిజిటిల్‌ పద్ధతిలో లావాదేవీలు జరిపే వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది.
ప్రతివారం డ్రా నిర్వహించి 7వేల మందికి రూ.50వేలు, రూ.5వేలు, రూ.2,500 ఇస్తారు.
ఈ పథకాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతినాడు ముగించనున్నారు. ఆ సందర్భంగా మెగా డ్రా నిర్వహిస్తారు. వినియోగదారుల్లో ప్రథమ విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50 లక్షలు, మూడో విజేతకు రూ.25 లక్షలు అందిస్తారు.
వ్యాపారులకు మొదటి బహుమతి కింద రూ.50లక్షలు, రెండో బహుమతికింద రూ.25 లక్షలు, మూడో బహుమతికింద రూ.5 లక్షలు అందిస్తారు. నవంబర్‌ 8 నుంచి ఏప్రిల్‌ 13వరకు జరిపిన డిజిటల్‌ లావాదేవీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఆధార్‌ ఆధారిత లావాదేవీలు, వినియోగదారులు-వ్యాపారులు, వినియోగదారులు-ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన రూ.50 నుంచి రూ.3వేలోపు డిజిటల్‌ లావాదేవీలను ఈ పథకాల కింద పరిగణనలోకి తీసుకుంటారు.
లావాదేవీల గుర్తింపు సంఖ్య (ట్రాన్షాక్షన్‌ ఐడీ) ఆధారంగా విజేతలను ర్యాండం డ్రా ద్వారా ఎంపికచేస్తారు. ఇందుకోసం ఎన్‌సీపీఐ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిచేయనుంది.
డిజిటల్‌ లావాదేవీలకు మళ్లని పేద, మధ్యతరగతివర్గాలను ప్రోత్సహించేందుకు రూపేకార్డులు, యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ, ఆధార్‌ఆధారిత చెల్లింపులను మాత్రమే డ్రాలోకి తీసుకుంటున్నారు.
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్కీడ్రా పథకాలను ప్రధాని మోదీ.. గుర్తుంచుకునే క్రిస్మస్‌కానుకగా అభివర్ణించారు. ఈ పథకాలు డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సహిస్తాయని ట్వీట్‌ చేశారు. అవినీతి రహిత భారత్‌ దిశగా పయనించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది.

No comments:

Post a Comment