ఇటలీ వంతు వచ్చేసింది..! నేడు ప్రజాభిప్రాయ సేకరణ ప్రపంచ దేశాల ఉత్కంఠ
బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక అంశం ‘ఇటలీ రెఫరెండమ్’. రాజ్యాంగంలో చేపట్టబోయే చట్ట సంస్కరణలు సహేతుకమా.. కాదా.. అన్న అంశంపై అక్కడి ప్రజలు నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇటలీ చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధానంతరం జరగబోయే ఈ అతిపెద్ద సంస్కరణపై ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు దృష్టి సారిస్తున్నాయి.
అసలెందుకు...
ఈ రెఫరెండం ఆలోచన ప్రస్తుత ఇటలీ ప్రధాని మాటియో రెంజీదే. ఇటలీ రాజకీయాలు అనిశ్చితికి పెట్టింది పేరు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు.. పార్లమెంట్‌లో ఎగువ సభ బలాన్ని 315 నుంచి 100కు తగ్గించడమే రెంజీ ధ్యేయం. ఒకవేళ బలం తగ్గిన పక్షంలో అధికారాలు కూడా తగ్గుతాయి. రెఫరెండం వల్ల ఇటలీకి స్థిరత్వం లభిస్తుందని రెంజీ అంటున్నారు. వృద్ధి విషయానికొస్తే.. గత రెండు దశాబ్దాల్లో ఇటలీ బాగా వెనకబడిపోవడం సైతం ఇందుకు దారితీసింది.
ఏం జరుగుతుంది
రెఫరెండంలో ఓడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని రెంజీ ముందే ప్రకటించారు. ఇదే జరిగితే అధ్యక్షుడు సెర్గియో మాటెరెల్లా ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఇది ఇటలీలో రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి ఇటలీ బయటకు వెళ్లే ప్రమాదమూ ఏర్పడుతుంది. అయితే ఇది అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఇటలీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోయాయి.
ఇటలీకి కేంద్ర బ్యాంక్ లేకపోవడంతో.. పూర్తిగా ఈసీబీపైనే ఆధారపడుతోంది. స్టాక్ మార్కెట్లు అయితే ఇప్పటికే సగానికి సగం పతనం కావడం ఆందోళనలను పెంచుతోంది.
ప్రపంచ మార్కెట్లపై
భారత కాలమానం ప్రకారం.. నేటి ఉదయం 11.30 నుంచి 3.30 గంటల మధ్య ఓటింగ్ జరగనుంది. ఫలితాలు సోమవారం వెలువడతాయి. సంస్కరణలకు అనుకూలంగా తీర్పు వస్తే.. అంతర్జాతీయ మార్కెట్లకు వూరట లభించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వచ్చిన పక్షంలో.. ఇటలీ మార్కెట్లు కుప్పకూలవచ్చు. ఈ ప్రభావం ఐరోపా సూచీలతో సహా ప్రపంచ మార్కెట్లపై పడొచ్చని అంటున్నారు. మన మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపేమీ కాకపోవచ్చు.
No comments:
Post a Comment