జయలలిత సరసన నటించాలని శోభన్‌బాబు ఎనిమిదేళ్లు ఎదురు చూశారని తెలుసా? ఎదురు చూడ్డం కాదు ఒక విధంగా తహతహలాడారనే చెప్పాలి. నిజానికి జయలలిత, శోభన్ బాబు కలిసి నటించింది తక్కువే. అయినా వారిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం వెల్లివిరిసింది. ఆ బంధం గురించి శోభన్‌బాబు వేర్వేరు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఆ సంగతులు ఇవి...
‘వీరాభిమన్యు’ సినిమా శోభన్‌బాబు నట జీవితంలో మరువలేని విజయాన్ని అందించింది. 1965లో విడుదలైన ఈ సినిమా 12 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది. ఆ తర్వాత వెంటనే అవకాశాలు వచ్చిపడకపోయినా, శోభన్‌బాబు సినీ జీవితానికి చక్కని బాట వేసిన సినిమా అది. ఆ రోజుల్లో ఓ నిర్మాత హడావుడిగా శోభన్‌బాబు ఇంటికి వచ్చి వెయ్యి రూపాయల కట్ట అడ్వాన్స్‌గా ఇచ్చి ‘నా సినిమాలో మీరే హీరో. జయలలిత హీరోయిన్’ అనేసి వెళ్లిపోయారు. ఆనాటికి జయలలిత సరసన హీరో అనగానే ఆశ్చర్యపోయే స్థాయి శోభన్‌బాబుది. ఆ అనుభూతిని ఆయనే ఓసారి చెప్పారిలా.
‘‘తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో టాప్ హీరోలందరితో నటిస్తున్న జయలలిత పక్కన నాకు అవకాశం అంటే ఎంత అదృష్టం. ఏదో తెలీని ఆనందం. అప్పటికింకా ఆమెను చూడనైనా లేదు నేను. ఆమెను చూడాలని తపించాను. తపించాననడం కంటే తపస్సు చేశాననే అనాలి. ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను’’.
అయితే ఇంతలా శోభన్‌బాబులో ఆశలు రేపిన ఆ సినిమా నిర్మాత మళ్లీ పత్తాలేకుండా పోయాడు. అయితే శోభన్‌బాబు కల ఆ తర్వాత ఎనిమిదేళ్లకి నెరవేరింది. ఆ సినిమానే ‘డాక్టర్ బాబు’. ఈ సినిమాకు శోభన్‌బాబు ఖరారైనా హీరోయిన్ ఎవరో తేలలేదు. ఓసారి విజయచిత్ర పత్రిక చూస్తున్న శోభన్‌బాబు అందులో జయలలిత ఫొటో చూశారు. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి ఆమెను సూచించారు. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్‌బాబు. అప్పటికి తల్లిని కోల్పోయిన కొత్తలో ముభావంగా, గంభీరంగా ఉండే జయలలితలో ఏదో తెలియని విషాదం గూడుకట్టుకుని ఉందని గ్రహించిన ఆయన హుషారుగా జోక్స్ వేస్తూ నవ్వించేవారు. ఆ ప్రవర్తనే జయలలితను ఆయనకు దగ్గర చేసింది. ఆ సంగతిని జయలలితే తనకు చెప్పినట్టుగా శోభన్‌బాబు ఓ సందర్భంలో చెప్పారు.
‘‘దిగులుతో నిండి బరువైపోయిన నా మనసును మీరు మీ ఛలోక్తులతో తేలిక చేశారు. మొన్నటి వరకు చాలనిపించిన ఈ బతుకు మీ పరిచయం వల్ల ఇంకా చాలదనిపిస్తోంది. అమ్మ పోవడంతో నాలో ఉత్సాహం లేదు. ఆశ లేదు. నా అన్నవారెవరూ లేరు. ఎవరైనా ఉన్నామని చెప్పినా అది నా డబ్బు కోసమే అని అర్థమైపోతోంది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అందుకే అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నాను. అలాంటి నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది’’ అంటూ జయలలిత చెప్పిన మాటలను శోభన్‌బాబు తరచు గుర్తు చేసుకునేవారు.
No comments:
Post a Comment