Monday, 26 December 2016

రామసక్కని సీతాయణం!



రామాయణం అంటే రాముడి కథ. సీతమ్మ కథ కూడా. మహాసాధ్విగా, లక్ష్మీ స్వరూపంగా జనం ఆ తల్లిని కొలుస్తున్నారు, ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నారు. ఆమె నడయాడిన భరతభూమి మీదే కాదు, కష్టాలు అనుభవించిన లంకారాజ్యంలోనూ సీతామాత ఆలయాలున్నాయి.

ఇయం సీతా మమ సుతా
సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రంతే
పాణిం గృహ్ణీష్వ పాణినా
- ‘రామా! ఇదిగో సీత. నా కూతురు. సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు మేలు జరుగుతుంది’ అని జనకమహారాజు కోరగానే, పురుషోత్తముడు పాణిగ్రహణం చేశాడు. మరునిమిషం నుంచీ సీతకు రాముడే ప్రపంచం, రాముడికి సీతే సర్వస్వం.
రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్‌, మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః - సీత హృదయం నిండా రాముడే, రాముడి హృదయం నిండా సీతే. తండ్రి ఆనతి ప్రకారం రాముడు అరణ్యానికి బయల్దేరుతున్నప్పుడు, తనూ వెంట నడిచింది సీత. ‘నీతో కలసి నడుస్తుంటే...ముళ్లు మృగచర్మంలా మెత్తగా అనిపిస్తాయి, పెనుగాలి ధూళి చందనాన్ని తలపిస్తుంది. ఎగుడుదిగుడు నేలలు హంసతూలికా తల్పంలా ఉంటాయి. నీ చేతి కందమూలాలైనా పంచభక్ష్యాలతో సమానం...’ అనాలంటే పెనిమిటి మీద ఎంత ప్రేమ ఉండాలి? దండకారణ్యంలో ఉన్నప్పుడు...రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు. మహా సంపన్నుడైనా, మహా తపశ్శాలి అయినా, మహా సౌందర్యవంతుడైనా...రావణుడు ఆమె దృష్టిలో గడ్డిపరకతో సమానమే. కాబట్టే, దశకంఠుడితో మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ...గడ్డిపరకను చూస్తూ మాట్లాడింది. ఎట్టకేలకు హనుమంతుడు సీత జాడ తెలుసుకున్నాడు. వానరసేనతో రాముడు లంక మీదికి దండెత్తాడు. దశకంఠుడిని సంహరించాడు. రావణుడి పార్ధివదేహం ముందు శోకాలు పెడుతూ మండోదరి ఓ గొప్ప మాట చెబుతుంది ..‘సీత వసుధాయా హి వసుధాం శ్రియః శ్రీం భర్తృవత్సలామ్‌’ - ఆమె ఓర్పులో భూమికే భూమి, శుభలక్షణాల్లో లక్ష్మికే లక్ష్మి.

ఆదికావ్యం పూర్తయిన తర్వాత వాల్మీకి మహర్షి తన రచనకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచించాడు. రాముడి కథ కాబట్టి, ‘రామాయణం’ అంటే సరిపోతుందని భావించాడు. అంతలోనే సీతమ్మ గుర్తుకొచ్చింది. భూమిలోంచి పుట్టి భూమిలో కలసిపోయేదాకా ...ఎంత జీవితం, ఎన్ని కష్టాలు, ఎంత ధైర్యం, ఎంత సౌశీల్యం! నారీణాం ఉత్తమం...మహిళల్లో రత్నం ఆమె, అప్రతిమా...సాటిలేని వ్యక్తిత్వం ఆ తల్లిది, అభిరామా...రూప సౌందర్యరాశి మైథిలి. మధుర భాషిణి...ఆమె మాట మధురం, శుచిస్మితభాషిణి...ఆమె పలకరింపూ మధురమే...ఇలా పరిపరి విశేషణాలతో సీతాదేవిని కీర్తించాడు. సీత మహా విద్యావంతురాలు. ధర్మశాస్త్రాలు చదువుకుంది. కాబట్టే కవి ఆమెను ‘ధర్మజ్ఞా’, ‘ధర్మపరా’, ‘ధర్మనిరతా’ అన్నాడు. సీతమ్మే లేకపోతే...రామాయణం మహా అయితే ఓ మహారాజు కథగా మిగిలిపోయేది. రాముడు ఒకానొక పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి చెందేవాడు. ఆయన ధర్మస్వరూపం ప్రపంచానికి తెలిసేది కాదు.
వాల్మీకి మహర్షి చివరికి ఓ నిర్ణయానికొచ్చాడు - ‘ఇది రామాయణమే కాదు...సీతాయణం కూడా. సీతాయాశ్చరితం మహత్‌’ అని నిర్ణయించాడు. ఆ మాట వినిపించగానే, ఆకాశంలోంచి పూలవర్షం కురిసింది. దైవ దుందుభులు మోగాయి. జనకుని కూతురిగా, రాముని ఇల్లాలిగా రామాయణంలో ఆమె స్థానం ప్రత్యేకమే అయినా, మహాసాధ్వి సీతగా భారతీయుల హృదయాల్లో ఆమెకు అంతకు మించిన స్థానం ఉంది. సీతమ్మే ప్రధాన దేవతగా అనేక ఆలయాలు వెలిశాయి.
లంకలో సీతాలయం...
సీతమ్మ సౌశీల్యం లంక ప్రజల్నీ కదిలించింది. లంకాపట్టణమని భావించే శ్రీలంకలో సీతమ్మవారికో గుడి కట్టి పూజిస్తున్నారు. నువారా ఎలియా అనే కొండ ప్రాంతాన్ని స్థానికులు అశోకవనంగా భావిస్తారు. ఇక్కడే సీతాదేవిని దశకంఠుడు బంధించాడని చెబుతారు. ఈ పరిసరాల్లోనే లంకేశ్వరుడి భవంతి ఉండేదనీ అంటారు. అందుకు ఆధారంగా కొన్ని శిథిలాల్నీ చూపుతారు. అచ్చమైన దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎక్కడెక్కడి జనమో వస్తుంటారు.
కేరళలోనూ...
కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలోని పుల్‌పల్లిలో వెలసిన సీతాదేవి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇక్కడ సీత...లవ కుశుల అమ్మగానూ పూజలు అందుకుంటోంది. రావణ సంహారం తర్వాత...జనాభిప్రాయానికి గౌరవమిచ్చి రాముడు సీతమ్మను అడవులకు పంపాడు. గర్భవతి అయిన జానకి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అక్కడే లవకుశులు జన్మించారు. బిడ్డల్ని రామచంద్రుడికి అప్పగించాక...సీతమ్మ భూమాతలో ఐక్యమైన చోటూ ఇదేనంటారు. పరిసరాల్లో ప్రవహిస్తున్న నది సీతమ్మ కన్నీటిలోంచి పుట్టిందని చెబుతారు. టిప్పుసుల్తాన్‌ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడట. అంతలోనే....ఆ పాలకుడి కళ్లు బైర్లుగమ్మాయి. ఆ అయోమయంలో నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వచ్చేశాడని ఐతిహ్యం. అలహాబాద్‌-వారణాసి పట్టణాల మధ్యలోని...సీతామార్ధిలో ప్రాచీన సీతాలయం ఉంది. హరియాణాలోని కర్నాల్‌లోనూ సీతమ్మకు గుడికట్టారు. నేపాలీలకైతే సీతమ్మ ఆడపడుచే. ఆ అయోనిజ జనకుడు నాగలి దున్నుతున్నప్పుడు దొరికింది. మిథిల ప్రాంతంలోని జనక్‌పూర్‌...నాటి మిథిలానగరమని ఓ కథనం. అక్కడ రాజపుత్ర నిర్మాణ శైలిలో మహాద్భుతమైన సీతాలయాన్ని నిర్మించారు.
రాముడు ధర్మానికి కట్టుబడితే...సీత రాముడికి కట్టుబడి ఉంది.
రామో విగ్రహవాన్‌ ధర్మః - రాముడు ధర్మస్వరూపుడు.
దేవ్యా కారుణ్యరూపాయా - సీత రూపుదాల్చిన ప్రేమ స్వరూపం.

No comments:

Post a Comment