Sunday, 16 July 2017

ఒకే దేశం.. ఒకే పన్ను!

జీఎస్‌టీ... ఈ కొత్త పన్ను విధానం అర్థమైతే మంచిది. భవిష్యత్తులో మనపైన దాని ప్రభావాన్నీ అర్థం చేసుకోగలిగితే మరీ మంచిది. దేశంలో అతిపెద్ద ఆర్థిక విప్లవం వస్తు, సేవల పన్ను అమలుతో మొదలైందని ప్రధాని అన్నారు. అవినీతినీ, నల్లధనాన్నీ నిరోధించి సామాన్యులకు మేలు చేయాలనే ఈ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చామని ఆర్థికమంత్రి అంటున్నారు. ఎవరేం చెప్పినా ఆ పన్ను లోటుపాట్లేంటో తెలుసుకొని లాభ నష్టాలను బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే.సృష్టిలో అర్థం కానివి మూడే మూడు. ఒకటి అమ్మాయి, రెండు క్రికెట్లో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం, మూడు జీఎస్‌టీ... అంటారు ఒకరు.
పెళ్లికాకముందు అమ్మకీ, నాన్నకీ, తమ్ముడికీ, తాతయ్యకీ- ఇలా అడిగినవాళ్లందరికీ డబ్బులిస్తుంటాం. అదే పెళ్లయ్యాక(జీఎస్‌టీ వచ్చాక) డబ్బంతా భార్య చేతిలో పెడితే చాలు, ఇంకెవ్వరూ మనల్ని డబ్బులడగరు... అని వస్తు సేవల పన్నుకి సులువైన నిర్వచనం ఇస్తారు ఇంకొకరు.
ఇక్కడ రెండు ఉదాహరణలూ సరైనవే. చూసే కోణాన్ని బట్టే జీఎస్‌టీ రూపం మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశం ఒక్కటే కాబట్టి, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పన్నే జీఎస్‌టీ. అందులో 0, 5, 12, 18, 28శాతాలంటూ రకరకాల శ్లాబులు విధించింది. అదీ సామాన్యుల మంచికోసమే. ‘హవాయి చెప్పులకీ బెంజి కారుకీ ఒకే పన్ను వేయడం సరికాదు కదా’ అంటారు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. కాకపోతే ఆ వేర్వేరు పన్ను శాతాలే సామాన్యులకు చిక్కుముళ్లలా కనిపిస్తున్నాయి. జీఎస్‌టీ అమలయ్యాక కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకొన్ని తగ్గాయి. ఇప్పుడు పెరిగిన ధరలూ భవిష్యత్తులో తగ్గడం ఖాయమని ఆర్థిక మంత్రి అభయమిస్తున్నారు. అసలీ గందరగోళమంతా ఎందుకు... జీఎస్‌టీ పూర్తి స్వరూపమేంటో తెలుసుకుంటే, అది మంచో చెడో, లాభమో నష్టమో మనమే అర్థం చేసుకోవచ్చు.జీఎస్‌టీ అంటే?
దేశానికి స్వాతంత్య్రం రాకముందూ పన్నులు కట్టాం. ఇప్పటికీ కడుతూనే ఉన్నాం. రోజులు గడిచేకొద్దీ ఆ పన్నులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. పాత పన్నుల విధానంలో మార్పుచేర్పులు చేస్తూ పన్నెండేళ్ల క్రితం అన్ని వస్తువులపైనా ‘వ్యాట్‌’ (విలువ ఆధారిత పన్ను) అనే కొత్త పన్నుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని అన్ని రాష్ట్రాలూ విజయవంతంగా అమలు చేస్తూ వచ్చాయి. కానీ అందులోనూ ఎన్నో లొసుగులు. అమలుతీరులోనూ ఎన్నో లోపాలు. 125కోట్ల మంది భారతీయులుంటే, అందులో 1.9కోట్లు- అంటే కేవలం 1.5శాతం మాత్రమే ప్రభుత్వానికి ఆదాయ పన్ను కడుతున్నారు. తమకు ఏడాదికి పదిలక్షలకు పైగా సంపాదన ఉందని చెబుతున్న వారి సంఖ్య 24లక్షలు. కానీ ఏటా ఇరవై ఐదు లక్షలకు పైగా కార్లు దేశంలో అమ్ముడవుతున్నాయి. మన చుట్టూ ఉన్న పెద్ద అపార్టుమెంట్లూ, భవనాలూ, విల్లాల్లాంటివన్నీ ఆ అంకెలు అబద్ధమని చెప్పకనే చెబుతున్నాయి. ఆ పరిస్థితి మారాలంటే, అర్హులైన వాళ్లందరి నుంచీ పన్నులు వసూలు చేయాలి. అంటే ఇప్పుడున్న విధానం మారి పటిష్ఠమైన మరో కొత్త విధానం అమల్లోకి రావాలి. దానికోసం ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలూ, ఆర్థిక నిపుణులూ సాగించిన మేధోమథనం నుంచి పుట్టిన కొత్త పన్నుల విధానమే జీఎస్‌టీ.
సేల్స్‌ టాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, ఎంట్రీ టాక్స్‌, పర్చేజ్‌ టాక్స్‌ అంటూ నిన్నమొన్నటిదాకా దాదాపు పదిహేనుకి పైగా పన్నులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ రద్దయి, వాటి స్థానంలో జీఎస్‌టీ ఒక్కటే వచ్చి చేరింది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలవుతుంది. వస్తువు ఒక్కటే అయినా, గతంలో రాష్ట్రాలకు తమకు అనువుగా వాటిపైన ప్రత్యేక పన్నులు వేసుకునే అవకాశం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో పన్ను రాయితీలు కల్పించేవి. కానీ జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలకున్న ఆ వెసులుబాట్లన్నీ తొలగిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచీ కేరళ తీరం వరకూ ఇప్పుడు ప్రతి వస్తువుకీ ఎక్కడైనా ఒకే శ్లాబులో పన్ను పడుతుంది. పైకి కనిపించని పన్నుల బాదుడు లేకుండా ఎవరైనా జీఎస్‌టీ ఒకటి కడితే సరిపోతుంది.ఎవరికి లాభం?
జీఎస్‌టీ వల్ల సామాన్యుడి నుంచి కార్పొరేట్‌ సంస్థల వరకూ అందరికీ ఎంతోకొంత లాభమేనని ప్రభుత్వం చెబుతోంది.
సామాన్యులకు:
బియ్యం, పాలూ, గుడ్లూ, ఉప్పూ, కూరగాయలూ, విడి గోధుమపిండీ, మైదాపిండీ లాంటి అనేక నిత్యావసరాలు సున్నా శాతం పన్ను జాబితాలోకి చేరాయి. టీపొడి, పంచదార, నూనెలు, జీడిపప్పు లాంటివి ఐదు శాతం, సెల్‌ఫోన్లూ, పచ్చళ్లూ, వెన్న, నెయ్యి లాంటివి 12శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. మొత్తంగా రోజువారీ జీవితంలో ఉపయోగపడే వస్తువుల్లో 81శాతం సున్నా నుంచి 18శాతం లోపు పన్ను పరిధిలోకే వస్తున్నాయి. అందులోనూ నిత్యావసరాలపై పన్ను మరింత తగ్గింది. ఇది పేద, దిగువ మధ్యతరగతి వాళ్లకు లాభదాయకం. మధుమేహం, క్యాన్సర్‌లాంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఔషధాల ధరలూ తగ్గాయి. పన్ను ప్రయోజనాల వల్ల వచ్చే లాభాన్ని గతంలో సంస్థలు వినియోగదార్లకు అందించేవి కావు. కానీ ఇప్పట్నుంచీ కచ్చితంగా ఆ మిగులు ఆధారంగా వస్తువుల ధరల్ని తగ్గిస్తున్నారో లేదో చూడటానికి ‘యాంటీ ప్రాఫిటీరింగ్‌’ కమిటీ పనిచేస్తుంది. అలా ధరలు తగ్గించని సంస్థల లైసెన్సును రద్దు చేసే హక్కూ ఈ కమిటీకి ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశమూ ఉంది.
సంస్థలకు:
గతంలో ఒక వస్తువు తయారీకి వంద రూపాయలు ఖర్చయింది అనుకుంటే, దానిపైన పది శాతం చొప్పున పన్ను చెల్లించి డీలర్‌కి అమ్మితే దాని ధర రూ.110 అయ్యేది. ఆ డీలర్‌ మరో పదిశాతం చెల్లించి రూ.121కి స్థానిక డిస్ట్రిబ్యూటర్‌కీ, అతడు ఇంకో పదిశాతం చెల్లించి దాదాపు రూ.133కి దుకాణదారుడికి అమ్మేవాడు. అంటే ఇక్కడ ఒకసారి పన్ను కట్టిన వస్తువుకే వివిధ దశల్లో మళ్లీ పన్ను కట్టాల్సివస్తుంది. కానీ జీఎస్‌టీ రాకతో ఆ విధానం మారిపోయింది. కొత్తగా వ్యాపారులకు ‘ఇన్‌పుట్‌ క్రెడిట్‌’ లభించనుంది. అంటే ఒక వ్యాపారి దగ్గర వంద రూపాయలకి ఓ వస్తువుని కొని దాన్ని రూ.150కి తిరిగి అమ్మితే, రెండో వ్యాపారి ఆపైన యాభై రూపాయలకు పన్ను కడితే సరిపోతుంది. తక్కిన వందకు మొదటి వ్యాపారే పన్ను కడతాడు. ఈ ‘ఇన్‌పుట్‌ క్రెడిట్‌’ పన్ను చెల్లింపుల్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల సంస్థలకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.
రాష్ట్రాలకు:
జీఎస్‌టీకి ముందు ఒక వస్తువు ఏ ప్రాంతంలో తయారయ్యేదో, పన్ను వసూలు కూడా ఆ రాష్ట్రం నుంచే (ఆరిజన్‌ బేస్డ్‌) మొదలయ్యేది. కానీ కొత్త వస్తు, సేవల పన్ను విధానంలో ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు తయారైన వస్తువు చివరిగా ఏ ప్రాంతంలో వినియోగమవుతుందో, ఆ రాష్ట్రానికే (డెస్టినేషన్‌ బేస్డ్‌) దాని తాలూకు పన్ను దక్కుతుంది. అంటే ఎక్కువ కొనుగోలు శక్తి కలిగిన రాష్ట్రాలకు పన్నులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరోపక్క గతంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య సరకు రవాణాకి పన్నులు ఎక్కువగా ఉండటంతో చిన్నరాష్ట్రాలు ఇతర ప్రాంతాలకు తమ ఉత్పత్తుల్ని పంపించడానికి వెనకడుగు వేసేవి. కానీ ఇప్పుడు దేశమంతా ఒకే మార్కెట్‌గా మారి, పన్నుల భారం తగ్గడంతో వెనకబడిన రాష్ట్రాల ఉత్పత్తులూ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.ఎవరికి భారం?
 దేశంలో ఎగువ మధ్యతరగతి ప్రజలూ, సంపన్నుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో పాటే వాళ్ల జీవనశైలీ మారుతోంది. జీఎస్టీ రాకతో ఆ ఖరీదైన జీవితం ఇంకాస్త భారం కానుంది. ఎయిర్‌ కండిషనర్లూ, ఫ్రిజ్‌లూ, వాషింగ్‌ మెషీన్‌లూ, వాచ్‌లూ, లెదర్‌ బ్యాగ్‌ల లాంటివి మరింత ప్రియం కానున్నాయి. వ్యాపారికి లాభం వచ్చినా రాకపోయినా, మార్కెట్‌లోకి వచ్చే ప్రతి వస్తువుపైనా పన్ను చెల్లించాలన్నది కొత్త నిబంధన. కాబట్టి ఇకపైన ఉచిత ఆఫర్లు కనిపించకపోవచ్చు. ఎందుకంటే వ్యాపారి ఏదైనా వస్తువుని వినియోగదార్లకి ఉచితంగా ఇచ్చినా, దానికి జీఎస్‌టీని మాత్రం వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిందే.
చిన్న వ్యాపారులు:
ఫర్నిచర్‌, వస్త్రాలూ, గ్రానైట్‌ లాంటివాటిపైన 28శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల ఆయా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా వినియోగదార్ల సంఖ్య తగ్గుతుంది. దానివల్ల వ్యాపారులు నష్టపోవాల్సి వస్తుందన్నది చాలామంది ఆందోళన.
మరోపక్క 20లక్షల రూపాయలకు పైగా వార్షిక టర్నోవరు ఉన్న వ్యాపారులంతా జీఎస్‌టీలో నమోదు చేసుకోవాలన్నది కొత్త నిబంధన. అంటే చిన్నస్థాయి వ్యాపారులకు ఆ అవసరం లేదు. కాకపోతే ఇక్కడే మరో మెలిక కూడా కనిపిస్తుంది. జీఎస్‌టీ కింద నమోదు చేసుకున్న సంస్థలు, మరో జీఎస్‌టీ నమోదిత సంస్థ నుంచి ఏవైనా వస్తువులు కొన్నప్పుడు మాత్రమే దానికి కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అంటే ‘ఎ’ అనే వ్యక్తి నుంచి ‘బి’ అనే వ్యక్తి ఏదైనా వస్తువు కొంటే దానికి సంబంధించిన పన్నులను ‘ఎ’ నేరుగా ప్రభుత్వానికి జమ చేయాలి. కానీ ‘ఎ’ అనే వ్యక్తిది రిజిస్టర్డ్‌ సంస్థ కాకపోతే, అప్పుడు ఆ పన్నుని ‘బి’ అనే వ్యక్తి ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. దీని వల్ల కొనేవాళ్లకి శ్రమ పెరుగుతుంది. మానవ వనరుల వినియోగం ఎక్కువవుతుంది. అందుకే కొత్తగా వచ్చిన ఈ ‘రివర్స్‌ ఛార్జ్‌’ అనే నిబంధన కారణంగా జీఎస్‌టీ నమోదిత సంస్థల మధ్యనే వ్యాపార కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో జీఎస్‌టీ పరిధిలోకి రాని వేలాది చిన్న వ్యాపారులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ జీఎస్‌టీ కింద నమోదు చేసుకోవాలని కొత్త నిబంధనలు పరోక్షంగా సూచిస్తున్నాయి.బహుళజాతి సంస్థలు:
ఇప్పటిదాకా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి అనేక బహుళజాతి సంస్థలు భారత్‌ నుంచి పొందే అనేక రకాల సమాచార సేవలపైన ఎలాంటి పన్నులూ లేకుండానే లాభాలు గడిస్తున్నాయి. ఈ-కామర్స్‌ సంస్థలు కూడా డెలివరీ ఛార్జీల లాంటి కొన్ని సేవల ద్వారా పొందే ఆదాయంపైన పన్నులు చెల్లించట్లేదు. ఇప్పుడు ఇలాంటి సేవలన్నీ జీఎస్‌టీ పరిధిలోకే వచ్చాయి. భారత్‌ నుంచి సేవలు పొందే ప్రతి సంస్థా జీఎస్‌టీ కింద తప్పనిసరిగా నమోదు చేసుకొని పన్నులు చెల్లించాలన్నది కొత్త నిబంధన. దీని వల్ల ఐటీ రంగంపైన గతంతో పోలిస్తే ఎక్కువ పన్ను భారం పడుతుంది. 
నల్లధనం తగ్గుతుందా?
జీఎస్‌టీ పక్కాగా అమలైతే దాని వల్ల నల్లధనం ఎంతోకొంత తగ్గే అవకాశం ఉందన్నది చాలామంది ఆర్థిక విశ్లేషకుల అంచనా.చెక్‌పోస్టుల దందా:
సరకులతో నిండిన లారీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చే సమయంలో ప్రవేశ రుసుం (ఎంట్రీ టాక్స్‌) పేరుతో గతంలో కొంత పన్ను వసూలు చేసేవారు. కానీ అక్కడ అధికారిక పన్నుల కంటే అనధికార వసూళ్ల దందానే ఎక్కువగా నడిచేది. పూర్తిగా పన్ను కట్టకుండా తనిఖీ అధికారుల చేతుల్లో ఎంతోకొంత పెట్టేసి డ్రైవర్లు గుట్టుగా సరిహద్దులు దాటేసేవారు. అలా ఏటా వేల కోట్ల రూపాయల అక్రమ దందా నడుస్తోందని అంచనా. తనిఖీ అధికారి ఉద్యోగం కోసం జరిగే పైరవీలూ, చేతులు మారే లంచాలు కూడా అన్నీ ఇన్నీ కావు. జీఎస్‌టీ రాకతో ఒక్క దెబ్బతో ఆ అవినీతి రాజ్యం భూస్థాపితమైంది. ఎంట్రీ ట్యాక్స్‌లను పూర్తిగా ఎత్తేయడంతో సరిహద్దుల దగ్గర చెక్‌పోస్టులనీ తొలగించారు. నల్లధనంపై జీఎస్‌టీ నేరుగా చేసిన దాడి ఇది. ఈ చెక్‌పోస్టుల వల్ల హైవేలపైన లారీలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. దాంతో దేశంలో సరకు రవాణా లారీలు రోజుకి సగటున 260కి.మీ.లే ప్రయాణిస్తున్నాయి. అమెరికాలో ఆ దూరం రోజుకి 800కి.మీ. జీఎస్‌టీ వల్ల ఇక్కడా ఆ సగటు పెరుగుతుంది.పన్నుల పండగ:
గతంలో చాలామంది వ్యాపారులు తమ లావాదేవీల్ని కాగితాలపైనే నమోదు చేసేవారు. దాంతో పన్ను చెల్లింపు సమయంలో వాటిని తమకు అనువుగా మార్చుకోవడం, కొన్ని బిల్లుల్ని దాచేయడం లాంటి పనుల ద్వారా లాభపడే అవకాశం ఉండేది. నిన్నమొన్నటి దాకా నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగేవి కాబట్టి, వాటిని పన్నులెక్కల నుంచి తప్పించడం కూడా సులువుగా ఉండేది. కానీ జీఎస్‌టీ రాకతో పన్ను రిటర్నుల నిర్వహణంతా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జరగాలనీ, ఎక్కడా కాగితాన్ని ఉపయోగించకూడదనీ కొత్త నిబంధన వచ్చింది. దీని వల్ల జీఎస్‌టీలో నమోదు చేసుకున్న ఏ వ్యాపారీ పన్నుల నుంచి తప్పించుకోలేడు. అదెలాగంటే... ఒక వస్తువు తయారీ నుంచి వినియోగదారుడి వరకూ వచ్చే మధ్యలో ఒక ఐదుగురి చేతులు మారిందనుకుందాం. అందులో తొలి వ్యక్తి సరిగ్గా పన్ను చెల్లిస్తే, రెండో వ్యక్తికి పన్నులో మినహాయింపు లభిస్తుంది. రెండో వ్యక్తి చెల్లిస్తేనే మూడు, మూడో వ్యక్తి నుంచి నాలుగు... ఇలా ఒకరికి దక్కే పన్ను ప్రయోజనాలు మరో వ్యక్తి పన్ను చెల్లింపులపైన ఆధారపడి ఉంటాయి. దాంతో ఈ లంకెలో ఏ కాస్త తేడా వచ్చినా, అవకతవకలు వెంటనే బయటపడతాయి. కాబట్టి జీఎస్టీ పరిధిలో ఉన్న పన్నుల్ని ఎగ్గొట్టడం అంత సులువు కాకపోవచ్చు. ఆ సానుకూల ప్రభావం దేశ ఖజానాపైనా కనిపిస్తుంది.
మరోపక్క పన్ను చెల్లింపుదార్లకు ఎన్నడూ లేనన్ని రాయితీలూ, ప్రయోజనాలను జీఎస్‌టీ బిల్లు కల్పిస్తోంది. దాంతో కొత్తగా లక్షలాది వ్యాపారులు తమ సంస్థలను రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే ప్రతి వ్యాపారికీ ‘జీఎస్‌టీ కంప్లయిన్స్‌ రేటింగ్‌’ని అందిస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సరిచూసుకోవచ్చు. దాని ఆధారంగా ఫలానా సంస్థతో వ్యాపార లావాదేవీలు జరపాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. ఎవరికి వారు తమ రేటింగ్‌ పెంచుకోవాలని చూస్తారు కాబట్టి, దీని ఫలితంగా రాబోయే రోజుల్లో నల్లధనం తగ్గి పన్నులు పెరిగే అవకాశాలు పుష్కలం.
జీడీపీ పెరుగుతుందా?
మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పన్నుల వాటా పదహారు శాతమే. చైనా, రష్యా, బ్రెజిల్‌లాంటి దేశాల్లో ఆ వాటా చాలా ఎక్కువగా ఉంది. నల్లధనం తగ్గి, పన్నుల వసూళ్లు పెరిగితే ప్రభుత్వ ఖజానా కళకళలాడుతుంది. ఫలితంగా జీడీపీలో పన్నుల వాటా దానంతటదే పెరుగుతుంది. దాంతోపాటూ స్థూల జాతీయోత్పత్తీ పెరుగుతుంది. అభివృద్ధి పథకాలకి నిధుల కోసం వెతుక్కోవాల్సిన అవసరమూ ఉండదు. జీఎస్‌టీని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో భారత జీడీపీ వృద్ధి చెందడం ఖాయమని అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదికతో పాటు అనేక సంస్థల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
మన దగ్గర ఎందుకు ఎక్కువ?
కెనడాలో ఐదు శాతం, మలేసియాలో ఆరు శాతం, థాయిలాండ్‌లో ఏడు శాతం, జపాన్‌లో ఎనిమిది శాతం... ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వస్తు, సేవల పన్ను మన దేశంతో పోలిస్తే తక్కువే. దానికి కారణం దేశంలోని పన్ను చెల్లింపుదార్ల సంఖ్యే. ఆదాయం ఎక్కువున్నా కాకి లెక్కలతో పన్నులు ఎగ్గొట్టేవాళ్లు మన దగ్గర చాలా ఎక్కువ. పన్నుల విభాగాల్లో అవినీతీ ఎక్కువే. ఉన్న కొద్దిమందీ చెల్లించే పన్నులతో దేశం ముందుకెళ్లడం అసాధ్యం. కాబట్టి తొలి దశలో మన జీఎస్‌టీ ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ పన్నుల విధానం కఠినతరం కావడంతో రాబోయే రోజుల్లో వాటి వసూలు పెరిగి, జీఎస్‌టీ తగ్గడం ఖాయం అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఇతర దేశాల్లో కూడా ఎక్కువ పన్నుతోనే మొదలై క్రమంగా తక్కువకి వచ్చి స్థిరపడింది. అంటే జీఎస్‌టీ రేటు... పన్నుల వసూళ్లతో పాటు ప్రజల నిజాయతీపైనా ఆధారపడి ఉంటుంది.మనమేం చేయాలి?
పనులు చేయట్లేదని ప్రభుత్వాన్ని నిలదీయడమే కాదు, సక్రమంగా పన్నులు చెల్లించడం కూడా ప్రతి పౌరుడి బాధ్యతే. ప్రభుత్వానికి కట్టే ప్రతి రూపాయీ గ్యాస్‌ సబ్సిడీ, మంచినీళ్లూ, రహదార్లూ, ప్రభుత్వాసుపత్రులూ, స్కూళ్లూ, సంక్షేమ పథకాలూ అంటూ ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికే వస్తుందని గుర్తుంచుకుంటే, పన్ను పోటు భారంగా అనిపించదు. అమెరికా అభివృద్ధికి కారణం అక్కడి ప్రభుత్వాలు మాత్రమే కాదు, మనతో పోలిస్తే (1.5శాతం) అక్కడ ఎక్కువ శాతం(48శాతం) పౌరులు ఆదాయ పన్ను సరిగ్గా కట్టడం కూడా.
పది రూపాయలైనా, లక్ష రూపాయలైనా కొన్న ప్రతి వస్తువుకీ బిల్లు తీసుకోవడం మన కర్తవ్యం. బిల్లు తీసుకోవట్లేదంటే ఆ మేరకు పన్ను ఎగ్గొట్టే అవకాశం వ్యాపారికి ఇస్తున్నట్టే. అది దేశ ద్రోహం కిందే లెక్క.
ఏమిటీ అపోహలు?
జీఎస్‌టీ వల్ల ప్రజలపైన పెనుభారం పడుతుందని రకరకాల వదంతులు సోషల్‌ మీడియాలో వ్యాపిస్తున్నాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్‌ అదియా కొట్టిపారేస్తున్నారు.
మొత్తంగా గతంలో ఉన్న పన్నులతో పోలిస్తే జీఎస్‌టీ చాలా ఎక్కువన్న మాట ప్రచారంలో ఉంది. గతంలో ఎక్సైజ్‌ పన్నులూ, ప్రవేశ రుసుం లాంటి కొన్ని పన్నులు బిల్లుల్లో పైకి కనిపించేవి కావు. కాబట్టి వినియోగదారుడికి వస్తువుపైన ఉన్నది మాత్రమే పన్నులా అనిపించి అది తక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడవన్నీ జీఎస్‌టీ కిందకే రావడంతో పన్ను ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి జీఎస్‌టీ అమలుతో రోజువారీ వినియోగంలో ఉన్న చాలా వస్తువులపైన పన్నులు తగ్గాయి.
క్రెడిట్‌ కార్డులతో ఏవైనా బిల్లులు చెల్లించినప్పుడు రెండుసార్లు జీఎస్‌టీ కట్టాల్సి వస్తుందనీ, అందువల్ల నగదు లావాదేవీలు మంచివనీ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదు. కార్డు ద్వారా చేసిన చెల్లింపుల ద్వారా ప్రత్యేకంగా ఎలాంటి పన్నూ ఉండదు.
జీఎస్‌టీ వల్ల ప్రతి వ్యాపారి దగ్గరా నిత్యం ఇంటర్నెట్‌ సదుపాయం ఉండాల్సిందేననీ, ఇన్‌వాయిస్‌లన్నీ కంప్యూటర్‌ ద్వారానే జారీ చేయాలన్నది మరో ప్రచారం. ఇన్‌వాయిస్‌లు కంప్యూటర్‌ ద్వారానే జారీ చేయాలన్న నిబంధనేమీ లేదు. నెలవారీ రిటర్నులు ఫైల్‌ చేసేప్పుడు మాత్రమే ఇంటర్నెట్‌ అవసరం. మిగతా సమయంలో లేకపోయినా ఇబ్బందేమీ లేదు.నిర్ణయం ఎవరిది?
కేంద్ర ప్రభుత్వమో లేక రాష్ట్ర ప్రభుత్వమో ఎప్పుడుపడితే అప్పుడు జీఎస్‌టీ చట్టంలో, నిబంధనల్లో మార్పుచేర్పులు చేయడం అసాధ్యం. జీఎస్‌టీ పైన సర్వాధికారాలూ జీఎస్‌టీ కౌన్సిల్‌వే. కేంద్ర ఆర్థిక మంత్రి ఆ కౌన్సిల్‌కి అధ్యక్షుడిగా, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అందులో సభ్యులుగా కొనసాగుతారు. కౌన్సిల్‌లో కేంద్రానికి ఒక వంతు, రాష్ట్రాలకు రెండొంతుల ప్రాధాన్యం ఉంటుంది. ఏ నిర్ణయం మారాలన్నా, అమలు కావాలన్నా నాల్గింట మూడొంతుల మంది సభ్యుల ఓట్లు రావాల్సిందే. అంటే అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రానికి కానీ జీఎస్‌టీ నిబంధనల్ని మార్చడానికి పూర్తి అధికారాలు ఉండవు. అందరూ ఒక మాట మీద నిలబడితేనే ఏ మార్పు చేర్పులైనా సాధ్యపడతాయి. అలా ఏళ్ల తరబడి అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలూ, వాళ్ల సలహాలూ సూచనల మేరకు రూపొందిన నిబంధనలూ, అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయానికి అనుగుణంగానే ప్రస్తుత జీఎస్‌టీ బిల్లు అమల్లోకి వచ్చింది. భవిష్యత్తులోనూ జీఎస్‌టీపైన సర్వాధికారాలూ ఆ కౌన్సిల్‌వే.మొదట ఎక్కడ?
ప్రపంచవ్యాప్తంగా 160కిపైగా దేశాల్లో జీఎస్‌టీ అమలులో ఉంది. ఆ జాబితాలో భారత్‌ కాస్త ఆలస్యంగానే చేరింది. అందరికంటే ముందు ఫ్రాన్స్‌ 1954లోనే తొలిసారిగా జీఎస్‌టీని అమల్లోకి తీసుకొచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎప్పుడో జీఎస్‌టీ బాట పట్టినా, అమెరికా ఇప్పటికీ ఆ విధానాన్ని అనుసరించట్లేదు.
జీఎస్‌టీపైన అవసరమైన సలహాలూ, సమాచారం, సేవల్ని అందించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా జీఎస్‌టీ సహాయ కేంద్రాలని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం లాభాపేక్షలేని విస్తృతమైన ఐటీ వ్యవస్థని త్వరలో తీసుకురానుంది. ఫలితంగా వేలాది కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది.
భారత్‌లో ఏటా ఇరవై లక్షలకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవాళ్లంతా జీఎస్‌టీ కింద నమోదు చేసుకోవాలి. అదే సింగపూర్‌లో అయితే వార్షికాదాయం రూ.4.8కోట్ల లోపు ఉన్నవాళ్లు జీఎస్‌టీ పరిధిలోకి వచ్చి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
జీఎస్‌టీ బిల్లుని రూపొందించే ప్రక్రియ మొదలై, అది అమలవ్వడానికి భారత్‌లో పదిహేడేళ్లు పట్టింది. తక్కిన దేశాల్లో సగటున రెండు మూడేళ్లలో ఆ ప్రక్రియ పూర్తయింది.
ఇప్పటిదాకా మన పార్లమెంటు నాలుగుసార్లు మాత్రమే అర్ధరాత్రి సమావేశమైంది. ఒకటి.. 1947లో స్వాతంత్య్రం సిద్ధించిన రోజున. రెండు... 1992లో క్విట్‌ ఇండియా ఉద్యమం యాభయ్యో వార్షికోత్సవం సందర్భంగా. మూడు... 1997లో స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్లయిన సందర్భంగా. నాలుగు... 2017 జులై 1న జీఎస్‌టీ బిల్లు ప్రవేశ పెట్టిన రోజున. 
* * *
మొన్నీమధ్య అమలు చేసిన పెద్ద నోట్ల రద్దయినా, ఇప్పుడు ప్రవేశ పెట్టిన వస్తు, సేవల పన్నైనా, భవిష్యత్తులో రాబోయే మరో పథకమేదైనా... అన్నింటి లక్ష్యం భారత్‌ని అవినీతి రహితంగా మార్చి, అభివృద్ధి మార్గంలో నడిపించడమే. కానీ అది ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో సాధ్యమయ్యేది కాదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లూ, రాజమౌళి సినిమాల కోసమే ఏడాదికిపైగా ఓపిగ్గా ఎదురు చూస్తున్న రోజులివి. అలాంటిది ప్రభుత్వ పథకాల ఫలితాల కోసం, మంచి భవిష్యత్తు కోసం కొన్నాళ్లు ఎదురు చూడలేమా! చూద్దాం... మన దేశ ‘గ్రేట్‌, సక్సెస్‌ఫుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’కి... ఈ ‘గుడ్‌, సింపుల్‌ టాక్స్‌’ పునాది వేస్తుందేమో..!