Monday, 26 December 2016

రామసక్కని సీతాయణం!



రామాయణం అంటే రాముడి కథ. సీతమ్మ కథ కూడా. మహాసాధ్విగా, లక్ష్మీ స్వరూపంగా జనం ఆ తల్లిని కొలుస్తున్నారు, ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నారు. ఆమె నడయాడిన భరతభూమి మీదే కాదు, కష్టాలు అనుభవించిన లంకారాజ్యంలోనూ సీతామాత ఆలయాలున్నాయి.

ఇయం సీతా మమ సుతా
సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రంతే
పాణిం గృహ్ణీష్వ పాణినా
- ‘రామా! ఇదిగో సీత. నా కూతురు. సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు మేలు జరుగుతుంది’ అని జనకమహారాజు కోరగానే, పురుషోత్తముడు పాణిగ్రహణం చేశాడు. మరునిమిషం నుంచీ సీతకు రాముడే ప్రపంచం, రాముడికి సీతే సర్వస్వం.
రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్‌, మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః - సీత హృదయం నిండా రాముడే, రాముడి హృదయం నిండా సీతే. తండ్రి ఆనతి ప్రకారం రాముడు అరణ్యానికి బయల్దేరుతున్నప్పుడు, తనూ వెంట నడిచింది సీత. ‘నీతో కలసి నడుస్తుంటే...ముళ్లు మృగచర్మంలా మెత్తగా అనిపిస్తాయి, పెనుగాలి ధూళి చందనాన్ని తలపిస్తుంది. ఎగుడుదిగుడు నేలలు హంసతూలికా తల్పంలా ఉంటాయి. నీ చేతి కందమూలాలైనా పంచభక్ష్యాలతో సమానం...’ అనాలంటే పెనిమిటి మీద ఎంత ప్రేమ ఉండాలి? దండకారణ్యంలో ఉన్నప్పుడు...రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు. మహా సంపన్నుడైనా, మహా తపశ్శాలి అయినా, మహా సౌందర్యవంతుడైనా...రావణుడు ఆమె దృష్టిలో గడ్డిపరకతో సమానమే. కాబట్టే, దశకంఠుడితో మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ...గడ్డిపరకను చూస్తూ మాట్లాడింది. ఎట్టకేలకు హనుమంతుడు సీత జాడ తెలుసుకున్నాడు. వానరసేనతో రాముడు లంక మీదికి దండెత్తాడు. దశకంఠుడిని సంహరించాడు. రావణుడి పార్ధివదేహం ముందు శోకాలు పెడుతూ మండోదరి ఓ గొప్ప మాట చెబుతుంది ..‘సీత వసుధాయా హి వసుధాం శ్రియః శ్రీం భర్తృవత్సలామ్‌’ - ఆమె ఓర్పులో భూమికే భూమి, శుభలక్షణాల్లో లక్ష్మికే లక్ష్మి.

ఆదికావ్యం పూర్తయిన తర్వాత వాల్మీకి మహర్షి తన రచనకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచించాడు. రాముడి కథ కాబట్టి, ‘రామాయణం’ అంటే సరిపోతుందని భావించాడు. అంతలోనే సీతమ్మ గుర్తుకొచ్చింది. భూమిలోంచి పుట్టి భూమిలో కలసిపోయేదాకా ...ఎంత జీవితం, ఎన్ని కష్టాలు, ఎంత ధైర్యం, ఎంత సౌశీల్యం! నారీణాం ఉత్తమం...మహిళల్లో రత్నం ఆమె, అప్రతిమా...సాటిలేని వ్యక్తిత్వం ఆ తల్లిది, అభిరామా...రూప సౌందర్యరాశి మైథిలి. మధుర భాషిణి...ఆమె మాట మధురం, శుచిస్మితభాషిణి...ఆమె పలకరింపూ మధురమే...ఇలా పరిపరి విశేషణాలతో సీతాదేవిని కీర్తించాడు. సీత మహా విద్యావంతురాలు. ధర్మశాస్త్రాలు చదువుకుంది. కాబట్టే కవి ఆమెను ‘ధర్మజ్ఞా’, ‘ధర్మపరా’, ‘ధర్మనిరతా’ అన్నాడు. సీతమ్మే లేకపోతే...రామాయణం మహా అయితే ఓ మహారాజు కథగా మిగిలిపోయేది. రాముడు ఒకానొక పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి చెందేవాడు. ఆయన ధర్మస్వరూపం ప్రపంచానికి తెలిసేది కాదు.
వాల్మీకి మహర్షి చివరికి ఓ నిర్ణయానికొచ్చాడు - ‘ఇది రామాయణమే కాదు...సీతాయణం కూడా. సీతాయాశ్చరితం మహత్‌’ అని నిర్ణయించాడు. ఆ మాట వినిపించగానే, ఆకాశంలోంచి పూలవర్షం కురిసింది. దైవ దుందుభులు మోగాయి. జనకుని కూతురిగా, రాముని ఇల్లాలిగా రామాయణంలో ఆమె స్థానం ప్రత్యేకమే అయినా, మహాసాధ్వి సీతగా భారతీయుల హృదయాల్లో ఆమెకు అంతకు మించిన స్థానం ఉంది. సీతమ్మే ప్రధాన దేవతగా అనేక ఆలయాలు వెలిశాయి.
లంకలో సీతాలయం...
సీతమ్మ సౌశీల్యం లంక ప్రజల్నీ కదిలించింది. లంకాపట్టణమని భావించే శ్రీలంకలో సీతమ్మవారికో గుడి కట్టి పూజిస్తున్నారు. నువారా ఎలియా అనే కొండ ప్రాంతాన్ని స్థానికులు అశోకవనంగా భావిస్తారు. ఇక్కడే సీతాదేవిని దశకంఠుడు బంధించాడని చెబుతారు. ఈ పరిసరాల్లోనే లంకేశ్వరుడి భవంతి ఉండేదనీ అంటారు. అందుకు ఆధారంగా కొన్ని శిథిలాల్నీ చూపుతారు. అచ్చమైన దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎక్కడెక్కడి జనమో వస్తుంటారు.
కేరళలోనూ...
కేరళలోని వయనాడ్‌ ప్రాంతంలోని పుల్‌పల్లిలో వెలసిన సీతాదేవి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఇక్కడ సీత...లవ కుశుల అమ్మగానూ పూజలు అందుకుంటోంది. రావణ సంహారం తర్వాత...జనాభిప్రాయానికి గౌరవమిచ్చి రాముడు సీతమ్మను అడవులకు పంపాడు. గర్భవతి అయిన జానకి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అక్కడే లవకుశులు జన్మించారు. బిడ్డల్ని రామచంద్రుడికి అప్పగించాక...సీతమ్మ భూమాతలో ఐక్యమైన చోటూ ఇదేనంటారు. పరిసరాల్లో ప్రవహిస్తున్న నది సీతమ్మ కన్నీటిలోంచి పుట్టిందని చెబుతారు. టిప్పుసుల్తాన్‌ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడట. అంతలోనే....ఆ పాలకుడి కళ్లు బైర్లుగమ్మాయి. ఆ అయోమయంలో నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వచ్చేశాడని ఐతిహ్యం. అలహాబాద్‌-వారణాసి పట్టణాల మధ్యలోని...సీతామార్ధిలో ప్రాచీన సీతాలయం ఉంది. హరియాణాలోని కర్నాల్‌లోనూ సీతమ్మకు గుడికట్టారు. నేపాలీలకైతే సీతమ్మ ఆడపడుచే. ఆ అయోనిజ జనకుడు నాగలి దున్నుతున్నప్పుడు దొరికింది. మిథిల ప్రాంతంలోని జనక్‌పూర్‌...నాటి మిథిలానగరమని ఓ కథనం. అక్కడ రాజపుత్ర నిర్మాణ శైలిలో మహాద్భుతమైన సీతాలయాన్ని నిర్మించారు.
రాముడు ధర్మానికి కట్టుబడితే...సీత రాముడికి కట్టుబడి ఉంది.
రామో విగ్రహవాన్‌ ధర్మః - రాముడు ధర్మస్వరూపుడు.
దేవ్యా కారుణ్యరూపాయా - సీత రూపుదాల్చిన ప్రేమ స్వరూపం.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే...


మనదేశంలో చాలమంది తల్లులు పసిపిల్లలకు పాలు పట్టిన అనంతరం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు. ఇందుకు సంబంధించిన వృత్తాంతం పురాణగ్రంథాల్లో వుంది. పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులుండేవారు. వీరు మాయా రూప విద్యలు తెలిసినవారు. దారిన వెళ్లే బాటసారులను పిలిచి భోజనం పెట్టేవారు. భోజనానికి ముందు వాతాపిని ఇల్వలుడు మేకగా మార్చేవాడు. మేకను చంపి దానితో వంటలు తయారు చేసి అతిథులకు వడ్డించేవాడు. అనంతరం వాతాపిని బయటకు రమ్మని పిలిచేవాడు. కడుపులో వున్న వాతాపి వారి కడుపులను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. దీంతో అతిథులు చనిపోయేవారు. ఇదే పద్దతిలో వాతాపి, ఇల్వలుడు అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. చనిపోయిన వారి నుంచి సంపదలను చోరీ చేసి దాచిపెట్టేవారు. ఇలా దోచుకున్న సంపదలు భారీగా పెరిగిపోయాయి. ఒక రోజున ఆ మార్గంలో అగస్త్య మహాముని వస్తున్నాడు. అతని గురించి తెలియని వారు తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. అందుకు మహర్షి అంగీకరించాడు.
భోజనం అనంతరం ఇల్వలుడు యథావిధిగా వాతాపి బయటకు రా అనబోయాడు. వీరి మాయోపాయాల్ని ముందుగానే పసిగట్టిన అగస్త్యుడు తన కడుపును నిమురుకుంటూ ‘‘ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’’ అన్నాడు. దీంతో మహర్షి వాక్కుతో వాతాపి జీర్ణమయిపోయాడు. మహర్షి మహిమకు భీతిల్లిన ఇల్వలుడు శరణుకోరాడు. ఇలా అనేకమంది అమాయకులను కబళించిన రాక్షసుల బెడదను అగస్త్య మహాముని తొలగించాడు. అందుకనే మన పెద్దలు అప్పుడప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు.

Sunday, 25 December 2016

2016... ఆవిష్కరణలు సూపరు!


జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. 2016లో కొత్తగా ప్రాణం పోసుకున్న అలాంటి ఆవిష్కరణలు ప్రజల ఆదరణని సొంతం చేసుకున్నాయి. ఏటా వాటిలో అత్యుత్తమ పరికరాల జాబితాను విడుదల చేసే ‘టైమ్‌’ సంస్థ, ఈసారీ కొత్త జాబితాతో సిద్ధమైపోయింది. 
డిసన్‌ బల్బుని కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిస్తే, మారిస్‌ అనే శాస్త్రవేత్త ఆ ప్రయత్నాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ గాల్లో తేలే బల్బుని తయారు చేశాడు. ఎలాంటి వైర్లూ, ఆధారం లేకుండా ‘ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌’ సిద్ధాంతాల ఆధారంగా తయారు చేసిన ‘లెవిటేటింగ్‌ ఫ్లైట్‌ బల్బ్‌’కు ఈ ఏడాది అత్యుత్తమ ఆవిష్కరణల్లో తొలి స్థానం దక్కింది. పాశ్చాత్య దేశాల్లో ఈ ఏడాది మొదట్లో మార్కెట్లోకి వచ్చిన బల్బుల ధర దాదాపు పాతిక వేల రూపాయలు.
జేబులో పట్టే హెల్మెట్‌:
జెఫ్‌ వూల్ఫ్‌ అనే రేసర్‌ ట్రాక్‌పైన ఓసారి పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్‌ లేకపోయుంటే తల పగిలిపోయి ఉండేదని డాక్టర్లు చెప్పారు. అంత ముఖ్యమైన వస్తువుని మోసుకెళ్లడం కష్టం కనుకే చాలామంది ధరించడానికి ఇష్టపడరని అతడికి అర్థమైంది. దాంతో తేలికపాటి హెల్మెట్‌ కనిపెట్టడమే ధ్యేయంగా పనిచేసిన జెఫ్‌, ఏకంగా మడుచుకొని జేబులో పెట్టుకోవడానికి వీలయ్యేలా ‘మార్ఫర్‌’ అనే కొత్త హెల్మెట్‌ని తయారు చేశాడు. అమెరికా, యూరప్‌లలో నాణ్యతా ప్రమాణాల్ని అందుకొని అక్కడి మార్కెట్లలోకి అడుగుపెట్టింది.
టైల్స్‌లో సౌర శక్తి: 
ఇంటిపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోకపోవడానికి విదేశాల్లో ఎక్కువమంది చెప్పే కారణం, ఇంటి అందం పాడవుతుందనే. దానికి పరిష్కారంగా ‘టెస్లా’ అనే సంస్థ చూడ్డానికి అందంగా ఉంటూనే, సౌర శక్తిని సేకరించి విద్యుత్‌గా మార్చే టైల్స్‌ను తయారు చేసింది. వీటి రాకతో ప్రపంచ వ్యాప్తంగా సౌర విద్యుత్‌ వినియోగం పెరుగుతుందన్నది సంస్థ మాట.
స్మార్ట్‌ బూట్లు:
బూట్లు వేసుకునే అలవాటున్న వాళ్లకీ, ముఖ్యంగా క్రీడాకారులకీ, వికలాంగులకీ రోజుకి ఎన్నిసార్లు వాటి తాళ్లు వూడిపోతాయో, ప్రతిసారీ కట్టుకోవడం ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో బాగా తెలుసు. నైకీ సంస్థ ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తూ, ఒక బటన్‌ నొక్కగానే కాలికి బిగుసుకుపోయి, మళ్లీ బటన్‌ నొక్కగానే వదులుగా మారిపోయే కొత్త రకం బూట్లను తయారు చేసింది.
సోనీ హెడ్‌సెట్‌:
వర్చ్యువల్‌ రియాలిటీ హెడ్‌ సెట్లను ఉపయోగించాలంటే బోలెడు డబ్బులు పెట్టి వాటికి తగ్గ వీడియో గేమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్లే స్టోర్‌లకే అనుసంధానించి వినియోగించేలా కొత్త వీఆర్‌ హెడ్‌సెట్‌ను సోనీ సంస్థ తయారు చేసింది. ఆ దెబ్బతో చాలా దేశాల్లో అంతంతమాత్రంగా ఉన్న వీఆర్‌ హెడ్‌సెట్ల వినియోగం విపరీతంగా పెరిగింది.
తలనొప్పికి ఇన్‌హేలర్‌: 
తలనొప్పీ, నిద్రలేమి లాంటి సమస్యలకు నిత్యం మాత్రల్ని ఆశ్రయించే వాళ్ల సంఖ్య ఎక్కువే. కానీ వాటి వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ప్రమాదం. దానికి పరిష్కరంగా తలనొప్పీ, ఒళ్లునొప్పులూ, నిద్రలేమి లాంటి వాటికీ తక్షణ ఉపశమనాన్నిచ్చే ‘వేపరైజర్‌ పెన్‌’లను ‘హెచ్‌ఎంబీ’ అనే సంస్థ కనిపెట్టింది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో మాత్రమే అందుబాటులో ఉన్న వీటిని ఇన్‌హేలర్‌లానే ఉపయోగిస్తే ఎలాంటి దుష్ఫలితాలూ ఉండవని సంస్థ చెబుతోంది.
నిద్రపుచ్చే అలారం:
‘హలో’ అనే గడియారాల తయారీ సంస్థ కనిపెట్టిన ‘హలో సెన్స్‌’ అనే అలారం నిద్రలేపడంతో పాటు హాయిగా నిద్రపుచ్చుతుంది కూడా. మనం నిద్రకు ఉపక్రమించే సమయానికి దాన్ని ఆన్‌ చేస్తే గదిలో వాతావరణాన్ని నియంత్రించడంతో పాటు గదిలో గాలిని శుద్ధి చేసి పరిమళాల్నీ వెదజల్లుతుంది. దానికుండే బల్బు వెలుతుర్నీ క్రమంగా తగ్గిస్తూ గాఢనిద్రలోకి జారుకున్నాక ఆగిపోతుంది. పొద్దున్నే గదిలో కాస్త వేడిని పెంచి, అప్పటికీ లేవకపోతే సంగీతాన్ని వినిపించడం మొదలుపెడుతుంది. నోటి ఆదేశాల ద్వారా పనిచేస్తూ, ఏ రోజు ఎన్నిగంటలు నిద్రపోయామో కూడా ఇది చెప్పేస్తుంది.
‘గుడ్‌ ఇయర్‌’ అనే సంస్థ తయారు చేసిన కారు చక్రాలు 360 డిగ్రీల కోణాల్లో తిరుగుతూ ఇరుకు ప్రదేశాల్లో మలుపు తీసుకోవడానికి పడే ఇబ్బందుల్నీ, పార్కింగ్‌ సమస్యల్నీ దూరం చేస్తున్నాయి. ‘క్విప్‌’ అనే స్మార్ట్‌ టూత్‌ బ్రష్‌ పళ్ల మీద ఉన్న బ్యాక్టీరియా, ఇతర సమస్యల గురించి సమాచారం ఇవ్వడంతో పాటు, టూత్‌బ్రష్‌ని మార్చాల్సిన సమయాన్నీ సూచిస్తుంది. మార్కెట్లో ఉన్న వాటికి భిన్నంగా ఏమాత్రం శబ్దం లేకుండా, తక్కువ వ్యవధిలో తలని ఆరబెట్టే హెయిర్‌ డ్రయర్‌ని డైసన్‌ అనే అమెరికన్‌ తయారు చేశాడు. ఈ మూడింటికీ టాప్‌-10 జాబితాలో చివరి మూడు స్థానాలు దక్కాయి. అంతరిక్ష ప్రయోగాల్లోని అద్భుతాలనో, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలనో ప్రస్తావించకుండా సాధారణ వ్యక్తుల రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వస్తువులకే ‘టైమ్‌’ ఓటేసింది. ఇంతకీ వీటిలో మీకెన్ని నచ్చాయి..!
శుభాకాంక్షలు సరికొత్తగా...
పువ్వులు చాలా అందంగా ఉంటాయి. ముమ్మాటికీ నిజమే. కాకపోతే ఎప్పుడూ చూసేవే కాబట్టి, ప్రత్యేకంగా మళ్లీ చూసేందుకు ఏమీ ఉండదు. పైగా ఎంత ఖరీదు పెట్టి కొన్నా అవి రెండు మూడు రోజులకే వాడిపోతాయి. ఆ తర్వాత మనం ఏం కానుక ఇచ్చామన్నది తీసుకున్నవారికీ గుర్తుండదు. ఈ కారణంతోనే కొందరు సృజనకారులు టెడ్డీబేర్‌, కుక్కపిల్ల లాంటి కార్టూన్‌, జంతువుల బొమ్మలతో బొకేలను తయారుచెయ్యడం మొదలుపెట్టారు. పువ్వులకు బదులు వేలెడంత సైజున్న రకరకాల సాఫ్ట్‌టాయ్‌ బొమ్మలను గుదిగుచ్చి రూపొందించే ఈ బొకేలు పూల బొకేల్లానే అందంగా ఉండడంతోపాటు, వినూత్నంగానూ ఉంటాయి. వీటిలో పెట్టే బొమ్మలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటికి మెరిసే పూసలూ గాజురాళ్లనూ అంటించి, రంగు రంగుల్లో ప్రకాశవంతంగా ఉండే శాటిన్‌ బట్టలతో అలంకరణ చేస్తారు. వాటిని ఎక్కువ సంఖ్యలో ఒకచోట తీరుగా అమర్చడంతో ఈ బొకేలు చూడగానే కళ్లను కట్టిపడేస్తున్నాయి. ఇక, వీటిలో అచ్చంగా బొమ్మలనే పెట్టి తయారుచేసేవి కొన్నైతే, వాటికి మధ్యలో సహజంగా కనిపించే ప్లాస్టిక్‌ పువ్వులను అమర్చి రూపొందించేవి మరికొన్ని. అప్పటికప్పుడు ఇచ్చేవాటిలో అయితే, సహజమైన పువ్వుల్నే కొన్నిటిని పెట్టివ్వొచ్చు. ఇలా చూడచక్కగా ఉండడమే కాదు, జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్నిరోజులైనా చెక్కుచెదరవు బొమ్మ బొకేలు. కాబట్టి, ఇవి షోకేసుల్లోనూ ఫ్లవర్‌వేజుల స్థానంలోనూ అలంకరణ వస్తువులుగా పెట్టేందుకు కూడా పనికొస్తాయి. అమెజాన్‌, అలీబాబా, షడ్‌మార్ట్‌లాంటి చాలా ఆన్‌లైన్‌ సైట్లతో పాటు, పెద్ద బొకేల దుకాణాల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. కాస్త సృజన ఉంటే సొంతంగా కూడా వీటిని తయారుచేసుకోవచ్చు. సుతిమెత్తగా చూడచక్కగా ఉండే సాఫ్ట్‌టాయ్స్‌ అంటే మామూలుగానే పిల్లలతో పాటు యువతీయువకులక్కూడా ఎంతో మక్కువ. అందుకే, ప్రత్యేక సందర్భాలప్పుడు రంగు రంగుల్లో చిన్నగా ముద్దుగా ఉండే ఈ బొమ్మల బొకేలు వారికి ఇస్తే సంతోషంగానూ సరదాగానే కాదు, వెరైటీగానూ ఉంటుంది. కొత్త ఏడాదిలో కొంగొత్తగా శుభాకాంక్షలు చెబుదామా మరి.

Saturday, 24 December 2016

అన్నవరం. సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయం


కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం- శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి. ‘అన్న’వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం. పాదాలు దర్శించుకొని.. మెట్లపైగా పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి మహేశ్వరుడు.. అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివ-కేశవులు, అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు!
ఇక్కడ రోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సంప్రదాయ. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజూ సత్యదేవ వ్రతాలు, తిరుమల తరహాలో.. నిత్య కల్యాణాలు జరుగుతుంటాయి.
క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం
తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కి.మీ.ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామపెద్దలకు వివరించగా.. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.
దర్శన వేళలు
ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.
ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
* సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి
* వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.
విశేషాంశాలు.. పరిసరాల్లోని ఉపాలయాలు:కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం ఉన్నాయి. అన్నింటిలో దర్శనం ఉచితం. అలాగే ఇక్కడున్న పంపా జలాశయంలో నౌకా విహారం... ఫలభా యంత్ర(సన్‌ డయల్‌) సందర్శన పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. దూరప్రాంత భక్తులు ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో తమ బంధువులు... సన్నిహితుల కోసమని తీసుకెళ్తుంటారు.అన్నవరం శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్యపూజల సమయాలు:* రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ
* 5 గంటలకు ధూపసేవ
* ఉదయం 7 గంటలకు బాలభోగం
* 7.30 గంటలకు బలిహరణ
* ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ చతుర్వేద పారాయణలు
* మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
* సాయంత్రం 6 గంటలకు ధూపసేవ
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ దర్బారు సేవ
* రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఏకాంత సేవ
పూజల్లో పాల్గొనేందుకు రుసుముల వివరాలు:* పౌర్ణమికి నిర్వహించే ప్రత్యంగిర హోమంలో పాల్గొనేందుకు రూ.558
* స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రూ. 558
* పవళింపుసేవలో పాల్గొనేందుకు.. రూ. 50
* స్వామివారి శాశ్వత కల్యాణం(పదేళ్లు మాత్రమే) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 10వేలు
* శ్రీ స్వామివారి వ్రతం(పదేళ్లు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 7 వేలు
* స్వామివారి శాశ్వత నిత్యపూజ(పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 500
ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు:రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజాసామగ్రి సమకూరుస్తుంది. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.
* శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం(ప్రతి నెలా ముఖ నక్షత్రం రోజున)రూ. 3,000 టిక్కెట్‌పై అనుమతిస్తారు.
* రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ. 116 రుసుం చెల్లించాలి.
* శ్రీ సత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణపుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రూ. 3 వేలు రుసుముగా చెల్లించాలి.
ఉపాలయాల్లో నిర్వహించే పూజలు: ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి రూ. 558 చెల్లించాలి.
ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు: చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.
* చైత్ర బహుళ షష్టి నుంచి అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు.
* ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
వసతి, భోజన సౌకర్యం వివరాలు: రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.
రవాణా సౌకర్యం: కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.
ఆన్‌లైన్‌ సేవలు: దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు... ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు. 

Wednesday, 21 December 2016

కాణిపాకం-వినాయకుడు


సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.
క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!
నిత్యం పెరిగే స్వామి: వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.
కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.
బ్రహ్మహత్యా పాతక నివారణార్థం: స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు: మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.
సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.
పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550
సేవాఫలితం: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.
గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం: ‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.
గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.
సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58
సేవాఫలితం: ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.
మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300
సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.
సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151
సేవాఫలితం: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.
పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000
సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.
అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116
సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.
అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116
సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.
వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.
వసతి.. రవాణా సౌకర్యాలు: కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

Monday, 19 December 2016

భరోసా తగ్గుతోందా.. PF interest rate cut down to 8.65 per cent




ద్యోగ భవిష్య నిధి... పేరుకు తగ్గట్టే.. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఓ నమ్మకమైన పథకం. ఉద్యోగంలో ఉన్నప్పుడు పన్ను ఆదా కోసం.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే పథకంగానూ ఎంతో పేరు పొందింది. దాదాపు 64ఏళ్ల నుంచీ ఎంతోమంది తమ మలి జీవిత అవసరం కోసం ఇదొక్కటి చాలు...అన్నట్లు భావిస్తుంటారు. కానీ, తగ్గుతున్న వడ్డీ రేట్లతో సుమారు 6.38కోట్ల మంది ఈ భరోసా తగ్గుతోందా అనే ఆందోళనలో పడిపోయారు.
ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ సుపరిచితమైన పదం ఈపీఎఫ్‌ (ఉద్యోగుల భవిష్య నిధి). నిర్ణీత సంఖ్యలో ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా తప్పనిసరిగా ఈపీఎఫ్‌ సౌకర్యాన్ని కల్పించాల్సిందే. ఈపీఎఫ్‌ వర్తించే ఉద్యోగులందరికీ వారి మూల వేతనంలో నుంచి 12శాతాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. అదే శాతంలో యాజమాన్యమూ జమ చేస్తుంది. ఇది దీర్ఘకాలంపాటు క్రమశిక్షణతో పాటు సాగే ఒక పొదుపు పథకం. గత కొంతకాలంగా ఈ పథకంపై వచ్చే వడ్డీ తగ్గుతూ వస్తోంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటును 8.8శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. దీంతో ఇది భవిష్యత్తులో ఇంకా తగ్గనుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలవైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.
ఎందుకు తగ్గిస్తున్నారు?
ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు అనేక అంశాలు, కారణాలు ఉంటాయి. ఇక ప్రస్తుత పరిస్థితులనే తీసుకుంటే.. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. ప్రభుత్వ 10ఏళ్ల బాండ్ల రాబడి రేటు ఏడుశాతం కన్నా తక్కువగానే వస్తోంది. పైగా పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఇచ్చే రాబడి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇతర అన్ని సురక్షిత పొదుపు పథకాలపై వస్తున్న వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభించాయి. మన ఆర్థిక వ్యవస్థ నిదానంగా స్వల్ప వడ్డీ రేట్లకు అలవాటు పడే దిశలో ఉంది. రానున్న రెండుమూడేళ్లలో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. 8.8శాతం వడ్డీతో 2015-16లో రూ.409కోట్ల మిగులు సాధించిన ఈపీఎఫ్‌ఓ ఇదే వడ్డీ శాతంతో రూ.383కోట్ల లోటు వస్తుందంటోంది. వీటన్నింటినీ విశ్లేషిస్తే ప్రస్తుతం ఈపీఎఫ్‌పై వడ్డీ రేటులో 0.15% మాత్రమే కోత కోయడం కొంతలో కొంత నయమే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్నా...
భవిష్య నిధి మొత్తంపై రాబడిని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఇందులో నుంచి గరిష్ఠంగా 15శాతం వరకూ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలో (ఈటీఎఫ్‌)మదుపు చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలంలో ఇందులో మంచి లాభాలు వస్తాయనీ, తద్వారా ఖాతాదారులకు వడ్డీ కోత లేకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే.. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి సగటున 10శాతం వరకూ రాబడిని అనుకోవచ్చు. అంటే రూ.15 పెట్టుబడి పెడితే.. రూ.1.5 వస్తుంది. 85శాతం మొత్తం ప్రభుత్వ బాండ్లలో దాదాపు 7శాతం లోపే రాబడిని ఆర్జిస్తోంది. అంటే.. రూ.5.9 వరకూ వస్తుంది. అంటే.. మొత్తంగా చూస్తే.. 7.4-8శాతం లోపే వార్షిక రాబడిని ఆర్జిస్తోంది. అందుకే, రూ.383 కోట్ల వరకూ లోటు కనిపిస్తోందని ఈ లెక్కన మున్ముందు మరింత వడ్డీ రేట్ల కోతకు ఈపీఎఫ్‌ సభ్యులు సిద్ధం కావాల్సిందేనా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. గతంలో ప్రజా భవిష్య నిధి, ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు సమానంగా ఉండేవి. కానీ, ఇప్పుడు పీపీఎఫ్‌ వడ్డీ రేటు 8శాతమే. దీంతో సమానంగా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, రాజకీయ కారణాలు, ఎన్నికల నేపథ్యంలో అంత తొందరగా వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు. కానీ, రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల కోతకు సిద్ధపడాల్సిందే అంటున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.
నష్టం తక్కువేమీ కాదు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. బ్యాంకులు గరిష్ఠంగా 7.25శాతానికి మించి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా, కాస్త అధిక రాబడి ఇచ్చే వాటిలో ఈపీఎఫ్‌ ముందు వరుసలో ఉంది. అందుకే, చాలామంది ఇప్పటికీ స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్‌)లోనూ పొదుపు చేస్తుంటారు. అయితే, పీఎఫ్‌ వడ్డీ రేటును క్రమక్రమంగా తగ్గించడం ఒక విధంగా వీరందిరికీ నిరాశే అని చెప్పుకోవచ్చు. వడ్డీ రేటు కోతతో ఎంత నష్టం అని చూడటానికి ఓ ఉదాహరణ పరిశీలిద్దాం! 35 ఏళ్ల వ్యక్తి.. 58ఏళ్లకు పదవీ విరమణ చేస్తాడనుకుందాం. ప్రస్తుతం అతని పీఎఫ్‌ ఖాతాలో రూ.6లక్షలు ఉన్నాయి. ఇక ప్రతి నెలా రూ.6వేలు (ఉద్యోగి, ఉద్యోగ సంస్థవి కలిపి, పింఛను నిధికి పోను మిగిలినవి) ఈపీఎఫ్‌లో జమ అవుతాయనుకుందాం. అప్పుడు ఇప్పటివరకూ ఉన్న 8.8శాతం వడ్డీతో దాదాపు రూ.98,75,481 అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం తగ్గించిన వడ్డీ 8.65%తో లెక్కిస్తే సుమారు రూ.96,04,028 అవుతాయి. అంటే.. దాదాపు రూ.2,71,543 తగ్గుతాయన్నమాట. (ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా). భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే.. ఉద్యోగులకు అంతిమంగా సమకూరే నిధికూడా తరుగుతుంది.
అయినా వదులుకోవద్దు
ఈపీఎఫ్‌ వడ్డీ తగ్గుతుండటం బాధ కల్గించే విషయమే అయినప్పటికీ.. ఇందులో నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకొని వేరే చోట మదుపు చేద్దామనుకోవడం మాత్రం సరికాదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికీ 8.65శాతం అందించే సురక్షిత పథకం ఇదే అని వారంటున్నారు. జమ చేసే మొత్తానికి, వచ్చిన రాబడికీ పన్ను మినహాయింపు ఉండటం ఇందులో కలిసొచ్చే అంశంగా చూడాలి. ఉదాహరణకు 30శాతం పన్ను శ్లాబులో ఉన్నవారికి దాదాపు 12శాతంకన్నా అధికంగానే రాబడి గిట్టుబాటు అవుతుంది. 20శాతం శ్లాబులో ఉంటే.. 10.7శాతం; 10శాతం శ్లాబులో వారికి 9.3శాతం వరకూ నికర రాబడి వస్తుంది. కాబట్టి, అనవసరంగా ఈ నిధిని కదపకూడదు.
ఎన్‌పీఎస్‌ కోసమేనా?
కొన్నేళ్లుగా సురక్షిత పెట్టుబడి సాధనం ఈపీఎఫ్‌కు ఉద్యోగులు అలవాటు పడ్డారు. దీన్నుంచి జాతీయ పింఛను పథకం వైపు మళ్లేలా చూసేందుకు ప్రభుత్వం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 2016 బడ్జెట్‌లో ఈపీఎఫ్‌ పథకానికి కొన్ని మార్పులు ప్రతిపాదించిందీ ఈ ఉద్దేశంతోనే. కాకపోతే ప్రజాందోళనల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ఇందులో మదుపు చేసిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌ పథకాల్లో సొంతంగా నిర్వహించుకోవచ్చు. లేదా ఫండ్‌ మేనేజర్ల ఇష్టానికి వదిలేయవచ్చు. ఎన్‌పీఎస్‌ ఖాతాలో జమైన మొత్తాన్ని పదవీ విరమణ అనంతరం 40శాతం ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. 60శాతాన్ని వెంటనే పింఛను ఇచ్చే పథకాలకు కేటాయించాలి. దీర్ఘకాలంలో ప్రభుత్వం తనపై భారం పడకుండా ఉద్యోగులు, ప్రజలను ఈ పింఛను విధానంలోకి మార్చేందుకు వడ్డీ రేట్ల తగ్గింపును అస్త్రంగా వాడుకుంటుందనీ అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.


PF interest rate cut down to 8.65 per cent

Nearly 15 crore people subscribed to employees provident fund scheme will earn interest at the rate of 8.65 per cent on their savings in 2016-17. This is the lowest in the last seven years.
The decision was taken at the 215th meeting of the Employees Provident Fund Organisation (EPFO)’s central board of trustees, chaired by Labour Minister Bandaru Dattatreya in Bengaluru on Monday.

Earlier, the EPFO’s income projections showed 8.62 per cent as the feasible interest rate for 2016-17. However, the EPFO trustees decided to fix the interest rate slightly higher at 8.65 per cent following protests by trade union members, sources present at the meeting said.
EPF subscribers got 8.8 per cent rate of interest on their provident fund savings in 2015-16 and 2014-15.
While an interest rate of 8.62 per cent would allow the EPFO to keep a surplus of around Rs 22 crore, fixing the interest rate at the present rate of 8.8 per cent would have left it with a deficit of Rs 700 crore, EPFO’s income projections showed.

According to sources in EPFO, the lower interest rate is on account of poor rate of return on investments made by the EPFO on all fronts.
Even at 8.65 per cent, EPF will deliver better returns than other savings instruments such as small saving schemes. While Public Provident Fund (PPF) offers 8 per cent rate of return, Sukanya Samriddhi Account Scheme (savings scheme for the girl child) gives 8.5 per cent annual return. The interest rate on term deposits is 7-7.8 per cent at present.

Sunday, 18 December 2016


బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.  అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.
ఇంద్రకీలాద్రి స్థలపురాణం
త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.
పరిసరాల్లోని ఉపాలయాలు: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.
దర్శన సమయాలు
* వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
* ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
* ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
* మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
* రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో నిర్వహించే పూజలు:ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.
అన్నప్రసాద వితరణ: 1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు: విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్‌ నెహ్రూ సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.
వసతి సౌకర్యం: ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరంలో పలు ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

నమో.. సూర్యదేవా..


నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్‌ ప్రపంచానికి ఆయన వెలుగులు ప్రసారింప చేస్తూ జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదట సూర్యదేవుడినే ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి ప్రతిష్టితమైన దివ్యక్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌.
బ్రహ్మశాపంతో..
ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు బాధ నుంచి విముక్తి కలిగించమని కలిగించమని అతను నవగ్రహాలను ప్రార్థించాడు. దీంతో అనుగ్రహించిన గ్రహాధిపతులు అతనికి ఆ వ్యాధి నుంచి విముక్తి కలిగించారు. దీనిపై సృష్టికర్త బ్రహ్మ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోని శ్వేత పుష్పాల అటవీప్రాంతానికి వెళ్లిపొమ్మని శాపం పెడుతాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారకుడైన పరమేశ్వరుని కోసం తపస్సు ఆచరిస్తాయి. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి కలిగిస్తాడు. వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదించాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటూ ప్రార్థిస్తే వారికి బాధలు ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించాడు ఆ మహేశ్వరుడు.
ఉషా, ప్రత్యూషలతో కలిసి...
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తుంటారు. సూర్యదేవుడంటే తీక్షణమైన కిరణాలు కలిగినవాడు. అయితే అందుకు భిన్నంగా స్వామి మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో వుంటాడు. స్వామి వివాహవేడుకల్లో వుండటం విశేషం. మిగతా గ్రహాలకు కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలు వున్నాయి. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం.
ఆలయ నిర్మాణం
క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజైన కుళుత్తోంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివకామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలున్నాయి. వీటితో పాటు ప్రధాన మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం వుంది. ప్రాంగణంలోనే ఇతర ఏడు గ్రహాధిపతులకు ప్రత్యేకమైన ఆలయాలున్నాయి.
ఉత్సవాలు
తమిళమాసమైన తాయ్‌ నెలలో జరిగే రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. తాయ్‌ మాసం (జనవరి-ఫిబ్రవరి)లో ఈ వేడుక జరుగుతుంది. సూర్యదేవుని రథం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు తిరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో రథ సప్తమి వేడుకలను వైభవంగా పదిరోజుల పాటు జరుపుతారు. అలాగే ప్రతి తమిళమాసం ప్రారంభంలో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. మహాభిషేకానికి విశేషసంఖ్యలో భక్తులు హాజరవుతారు.
గ్రహశాంతికి ప్రత్యేక పూజలు
గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా వున్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి పూజలు సాంత్వన కలిగించమని వేడుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన... తదితర పూజలు నిర్వహిస్తారు. తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం... తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.
ఎలా చేరుకోవాలి
* రైలులో వచ్చే ప్రయాణికులు కుంభకోణం రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి ఆలయం 15 కి.మీ.దూరంలో వుంది. ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లవచ్చు.
* సమీప విమానాశ్రయం తిరుచినాపల్లిలో వుంది. విమానం దిగిన ప్రయాణికులు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్లవచ్చు. ( దూరం 110 కి.మీ.)
* వసతి సౌకర్యాలు: కుంభకోణంలోనే ఎక్కువ వసతి గృహాలున్నాయి.

Saturday, 17 December 2016

దేవ దేవుడు.. శ్రీ వేంకటేశుడు


‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం.
తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీవేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది.
స్థలపురాణం
కలియుగారంభంలో... అనగా సుమారు 5వేల సంవత్సరాల క్రితం.. వక్ష స్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. వేంకటపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా.. ఎందరో మహానుభావులు.. ఇక్కడ అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వసేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహస్వామివారిని దర్శించుకోవాలని స్థలపురాణంలో ఉంది. అలాగే స్వామి వారి దర్శనానంతరం... తిరుపతిలో పద్మావతి/బీబీనాంచారి/అలివేలుమంగ అమ్మవారిని, గోవిందరాజస్వామి వారిని దర్శించుకోవాలి. తిరుమలగిరులలో ఉన్న పవిత్ర ఆకాశగంగ.. పాపనాశనం.. వకుళమాత ఆలయం,, హాథీరాంజీ మఠం.. త్రిదండి జీయర్‌స్వామివారి మఠం..వన్యప్రాణుల పార్క్‌.. వంటి ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు. తితిదే బస్సు సర్వీసులతో పాటు ఆయా ప్రదేశాలకు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. తలనీలాలు మొక్కుబడి ఉన్నవారు తప్పనిసరిగా స్వామివారి ‘కల్యాణకట్ట’ వద్దనే తలనీలాలు సమర్పించాలి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన వేళలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేక దర్శనవేళలు ఒక్కోరోజు ఒక్కోవిధంగా ఉంటాయి. స్వామివారికి జరిగే నిత్య, వారపు సేవలను బట్టి ఆయా సమయాలను తితిదే నిర్దేశించింది. టిక్కెట్లను ముందస్తుగా అంతర్జాలం, ఈ-దర్శన్‌, తపాలా శాఖ ద్వారా విక్రయిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రంలోపు నిర్దేశించిన సమయంలోపు శ్రీవారిని దర్శించుకునే వేళలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న సమయం టిక్కెట్టుపై ముద్రితమవుతుంది. ఈ సమయానికి మాత్రమే ఆలయానికి చేరుకోవడానికి వరుస వద్దకు రావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నిత్యం రూ.300 ధర వంతున 26వేల టిక్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 56 రోజులకు ముందుగా టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. విశేష పర్వదినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల సంఖ్యను దేవస్థానమే తగ్గిస్తుంది.
తితిదే ప్రకటించిన వేళల వివరాలివీ:
వారంసమయం
ఆదివారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
సోమవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
మంగళవారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 7 గం. వరకు
బుధవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 7గం. వరకు
గురువారంఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శుక్రవారంఉదయం 10గం. నుంచి సాయంత్రం 4గం. వరకు
శనివారంఉదయం 7 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు
వృద్ధులకు, వికలాంగులకు దర్శన వేళలు:శ్రీవారి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు తితిదే ప్రత్యేక ప్రవేశ అవకాశం కల్పిస్తోంది. మందిరం మహాద్వారం సమీపం నుంచి ఆలయంలోకి చేరుకునే సౌలభ్యం కల్పించింది. నిత్యం ఉదయం 10, మధ్యాహ్నం 3గంటలకు ఆలయ ప్రవేశాలకు అనుమతిస్తుంది. ఈ దర్శన సమయాల కన్నా గంట ముందుగా ఆయా భక్తులు పరిశీలనకు హాజరవ్వాల్సి వుంటుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వయస్సు ధ్రువీకరణ పత్రం ఆధారంగా అనుమతిస్తారు. నడవలేని పరిస్థితిలో ఉన్నవారి వెంట సహాయకులను అనుమతిస్తారు. వికలాంగులు, గుండె జబ్బుతో ఆపరేషన్‌ చేసుకున్న భక్తులను వైద్యులు జారీచేసి పత్రాల పరిశీలన అనంతరం అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో ఈ దర్శనాలను తితిదే రద్దు చేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తితిదే ముందుగానే ప్రకటిస్తుంటుంది.
తిరుపతి-తిరుమలకు ప్రయాణ సదుపాయాలు
తిరుమల, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోడ్డు.. రైలు.. ఆకాశ మార్గాల్లో విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకునే భక్తులకు స్టేషన్‌ ఎదురుగానే కొండపైకి తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి తిరుమలకు ప్రతి నిమిషానికో బస్సు చొప్పున బ్రహ్మోత్సవాల సమయంలో నడుస్తుంటాయి. ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
రేణిగుంట విమానాశ్రయం నుంచి నిత్యం మధ్యాహ్నం ఒక ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు తిరుమల నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి.. రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.30 నిమిషాలకు చేరుతుంది. తిరిగి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుమలకు బయల్దేరుతుంది. విమానాశ్రయంలో ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి కేంద్రంగా ఉన్న ట్రావెల్‌ కంపెనీలకు సమాచారం ఇచ్చే పక్షంలో వాహనాలను సమకూర్చుతారు. అన్ని రకాల సొంత వాహనాలనూ తిరుమల వెళ్లేందుకు తితిదే అనుమతిస్తోంది. అలిపిరి భద్రతా వలయంలో తనిఖీలు నిర్వహించుకున్న అనంతరం టోల్‌ రుసుం చెల్లించి ఆయా వాహనాల్లో తిరుమలకు రావాల్సి ఉంటుంది. అన్ని రకాల వాహనాలు అలిపిరి నుంచి తిరుమలకు రెండో కనుమ రహదారిలో 28 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తితిదే వేగ నియంత్రణ చర్యలు చేపట్టింది. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి మొదటి కనుమ రహదారిలో ప్రయాణ సమయం 45 నిమిషాలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్దేశిత సమయం కంటే ముందుగా వచ్చే పక్షంలో సంబంధిత వాహనాలను తిరుమలకు 10 రోజులపాటు రాకుండా నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంటారు! రెండోసారి కూడా నిబంధనలు పాటించని పక్షంలో జరిమానా విధిస్తారు. సమయాన్ని లెక్కించడానికి అలిపిరి భద్రతావలయంలో వాహనదారులకు తితిదే బార్‌ కోడింగ్‌ రశీదులను జారీ చేస్తుంది.
కాలినడకన వెళ్లే భక్తుల కోసం
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు కాలినడకన రావడానికి తితిదే అనుమతిస్తుంది. అలిపిరి నుంచి 24 గంటల సమయం, శ్రీవారి మెట్టు ల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది. గరుడోత్సవం సమయంలో 24 గంటల సమయం అనుమతించాలని నిర్ణయించింది. అడవి జంతువులను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్టు మార్గంలో పగటి సమయంలో మాత్రమే భక్తుల రాకపోకలకు అనుమతిస్తున్నారు. వీరికి మార్గమధ్యంలో దివ్యదర్శనం టోకెన్లను తితిదే ఉచితంగా జారీ చేస్తుంది. టోకెన్లను పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పించడంతో పాటు ఒక లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. రెండు లడ్డూలు కావాలంటే రూ. 10 చొప్పున రాయితీపై అందజేస్తారు. అవసరమైన వారు రూ. 25 ధరపై మరో రెండు లడ్డూలూ పొందవచ్చు. భక్తుల లగేజీని తితిదేయే తిరుమలకు ఉచితంగా చేరవేస్తుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రవేశమార్గంలో ఈ ఉచిత లగేజీ రవాణా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి రశీదు చూపి ఈ లగేజీని తీసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో తితిదే ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద ఇవ్వడాన్ని రద్దు చేస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ కింద నిత్యం అంతర్జాలంలో 6వేలు, ఇ-దర్శన కౌంటర్ల ద్వారా మరో 5వేల టికెట్లను రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. టికెట్లలో నిర్దేశించిన సమయానికి ఆయా భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి దర్శనానికి హాజరుకావాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులు ధరించని పక్షంలో శ్రీవారి దర్శనానికి అనుమతించరు. ఒక్కో టికెట్‌పై రెండు ప్రసాద లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.
తిరుమలలో భక్తులందరికీ తితిదే స్వామివారి అన్నప్రసాదం అందజేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సిఫార్సు లేకుండా ప్రతిఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చు. బ్రహ్మోత్సవాల్లో రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడే భక్తులకు అల్పాహారం, పానీయాలనూ అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
వసతి సౌకర్యం
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 24 గంటలపాటు ఉచిత వసతి కల్పిస్తారు. తితిదే ఆధ్వర్యంలో తిరుపతి-తిరుమల ప్రాంతాల్లో సుమారు 15వేల కాటేజ్‌లు భక్తుల కోసం అందుబాటులో ఉన్నాయి. హాథీరాంజీ మఠం, జీయర్‌ మఠం, శంకరమఠం తదితర సంస్థల ఆధ్వర్యంలోనూ వసతి లభిస్తుంది.
ఇవికాక ఆర్జితసేవలు పొందేవారి కోసం ప్రత్యేక కాటేజ్‌లు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల టూరిజం శాఖల అతిథిగృహాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. ముందస్తు రిజర్వేషన్‌, ఇతర వివరాలకు తితిదే కార్యాలయంలో సంప్రదించాలి
ఆర్జితసేవ పేరుహాజరు కావాల్సిన సమయం
సుప్రభాతంఉదయం 2 గంటలకు
వస్త్రాలంకరణ సేవఉదయం 3 గంటలకు
అభిషేకంఉదయం 3 గంటలకు
తోమాలఉదయం 3గంటలకు
అర్చనఉదయం 4గంటలకు
నిజపాద దర్శనంఉదయం 4.30గంటలకు
అష్టదళ పాద పద్మారాధన సేవఉదయం 5 గంటలకు
సహస్ర కలశాభిషేకంఉదయం 5గంటలకు
తిరుప్పావడ సేవఉదయం 5గంటలకు
విశేషపూజఉదయం 6గంటలకు
కల్యాణోత్సవంఉదయం 10గంటలకు
వూంజలసేవఉదయం 11గంటలకు
ఆర్జిత బ్రహ్మోత్సవంమధ్యాహ్నం 1.30గంటలకు
వసంతోత్సవంమధ్యాహ్నం 2గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవసాయంత్రం 5గంటలకు
ప్రధాన/ ప్రత్యేక పూజలు:
నిత్యసేవలు: సుప్రభాతం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 120
నిత్యసేవలు: తోమాల
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: అర్చన
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళ, బుధ, గురుటిక్కెట్టు ధర: రూ.220
నిత్యసేవలు: కల్యాణోత్సవం
ప్రవేశం: ఇద్దరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ. 1000
నిత్యసేవలు: ఆర్జిత బ్రహ్మోత్సవం
ప్రవేశం: ఒకరికి రోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: డోలోత్సవం
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: సహస్ర దీపాలంకరణ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: నిత్యంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వారం సేవలు విశేషపూజ
ప్రవేశం: ఒకరికిరోజు: సోమవారంటిక్కెట్టు ధర: రూ.600
నిత్యసేవలు: అష్టదళ పాదపద్మారాధనం
ప్రవేశం: ఒకరికిరోజు: మంగళవారం టిక్కెట్టు ధర: రూ. 1,250నిత్యసేవలు: సహస్ర కలశాభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: బుధవారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: తిరుప్పావడ సేవ
ప్రవేశం: ఒకరికిరోజు: గురువారంటిక్కెట్టు ధర: రూ.850
నిత్యసేవలు: అభిషేకం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.750
నిత్యసేవలు: నిజపాద దర్శనం
ప్రవేశం: ఒకరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ.200
నిత్యసేవలు: వస్త్రాలంకరణ సేవ
ప్రవేశం: ఇద్దరికిరోజు: శుక్రవారంటిక్కెట్టు ధర: రూ. 12,250

బాసర-వాగ్దేవి ఆలయం


అంటూ తెలుగు ప్రజలంతా చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవంలో మొదట తలుచుకునే విద్యాధిదేవత.. జ్ఞాన ప్రదాయని.. బాసరలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారే!
క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: పూర్వం కురుక్షేత్ర యుద్ధం అనంతరం కొన్నాళ్లు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి తదితరులు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారట! వ్యాస భగవానులు రోజూ పావన గోదావరి జలాల్లో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం! అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ.. ఆ తల్లి దీవెనలు.. చల్లని చూపులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు.
దర్శనవేళలు
* రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
* ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
* అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
* 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
* ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు ఆరంభం.
* మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం
* మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు
* సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు
* రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.
వివిధ ఆర్జిత సేవలు/ పూజల వివరాలు
* అభిషేకసేవ టిక్కెట్టు: రూ.200(ఒక కుటుంబం లేదా నలుగురు మాత్రమే)
* ప్రత్యేక దర్శనం ఒక టిక్కెట్టుపై ఒకరు మాత్రమే
* సాధారణ అక్షరాభ్యాసం: రూ. 100
* ప్రత్యేక అక్షరాభ్యాసం: రూ. 1000
* నిత్య చండీ హవనం: రూ. 500
* కుంకుమార్చన రూ.50
 ఉప ఆలయాల సమాచారం: ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ.. ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి.. పార్వతి.. సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం.. వ్యాసుల వారి గుహ.. గోదావరి నది.. నదీ తీరాన మహేశ్వర ఆలయం.. బస్టాండ్‌ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) అవశ్య దర్శనీయ స్థలాలు. వీటన్నింటి దర్శనం ఉచితమే!
ఆలయంలో నిత్యం నిర్వహించే వివిధ పూజలు:అభిషేకం, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన.
ప్రత్యేక ఉత్సవాలు
* సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాభిషేకంతో పాటు అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తారు.
* దసరా నవరాత్రి ఉత్సవాలనూ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు.
* గురుపౌర్ణమి సందర్భంగానూ ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి. వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు.
* ఇక్కడ నిర్వహించే పూజలు.. ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యమేమీ లేదు.
వసతి వివరాలు: బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని దేవస్థానం 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథి గృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యముంది. బాసరలోని హోటళ్ల సమాచారం కోసం www. basarahotels.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
రవాణా సౌకర్యం: బాసర-జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రం.. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో అయితే.. 203కి.మీ.లు రైలు మార్గంలో అయితే.. 162 కి.మీ.ల దూరంలో ఉంది. బాసరకు నేరుగా విమానంలో వచ్చే సౌకర్యం లేదు. కానీ.. 15కు పైగా హైదరాబాద్‌ నుంచి నేరుగా బాసర వచ్చే రైళ్లు ఉన్నాయి. ఆ మేరకు హైదరాబాద్‌కు విమానంలో వచ్చి.. అక్కడి నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌..(17063), ఏకే కేసీజీ ఎక్స్‌ప్రెస్‌(17640), దేవగిరి ఎక్స్‌ప్రెస్‌(17057), కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(17406), నాందేడ్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌(57564) తదితర రైళ్లలో నేరుగా బాసర చేరుకోవచ్చు. రైల్లో సుమారు 2.40 గంటలు.. రోడ్డు మార్గంలో(వయా నిజామాబాద్‌) అయితే సుమారు 4.30 గంటల సమయం పడుతుంది.
మరిన్ని వివరాలకు ఆలయ విచారణ కేంద్రం ఫోన్‌: 08752-255503 నెంబరులో లేదా.. వెబ్‌సైట్‌:basaratemple.org ఇ-మెయిల్‌ ఐడీ:infobasaratemple.org లేదా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కార్యాలయంలోనైనా సంప్రదించవచ్చు.